– ఎంజీఎన్ఆర్ఈజీఏపై పర్యవేక్షణ పెంపు
– మోడీ సర్కారు నిర్ణయం
– రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
– ప్రత్యేకంగా ఎలాంటి నిధులూ కేటాయించని వైనం
– కేంద్రం తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకంపై కేంద్రంలోని మోడీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం పలు చర్యలతో ఈ పథకాన్ని నీరు గార్చేయత్నం చేస్తున్నది. ఇందుకు మోడీ సర్కారు గతంలో తీసుకున్న నిర్ణయాలే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలను ఆదుకున్న ఈ పథకంపై మోడీ సర్కారు చిన్న చూపే చూస్తున్నది. ఏటికేడు ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తూ ‘ఉపాధి’కి గండి పడేస్తున్నది. అంతేకాకుండా ఆధార్‌కార్డును అనుసంధానిస్తూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నిర్ణయం సైతం ఈ కోవకు చెందినదేనని నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మరొక ముందడుగు వేసిన కేంద్రం.. ఉపాధి పథకంపై డ్రోన్ నిఘాను తీసుకొచ్చింది. ఉగ్రవాదుల కదలికలు, శత్రుదేశాల సరిహద్దుల్లో అక్కడి సైనికుల కదలికల గురించి తెలుసుకోవడానికి ఉపయోగించాల్సిన డ్రోన్లను.. ఈ పథకం కింద వర్క్సైట్లలో ఉపయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. డ్రోన్లను ఉపయోగించాలన్న నిర్ణయం తీసుకున్న మోడీ సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చటంలో భాగమేనని నిపుణులు, విశ్లేషకులు తెలుపుతున్నారు. అయితే, ఉపాధి హామీ పని నాణ్యతను పెంచటానికి, అక్రమాలను కట్టడి వేసే చర్యలో భాగంగానే వీటిని ఉపయోగిస్తున్నట్టు కేంద్రం సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది.
పథకంపై ఇది సాంకేతిక జోక్యం
మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపీ) ప్రకారం.. డ్రోన్లు నాలుగు రకాల పర్యవేక్షణ కోసం ఉపయోగించబడతాయి. అవి.. కొనసాగుతున్న పనులను సర్వే చేయడం, పూర్తయిన పనులను తనిఖీ చేయడం, ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫిర్యాదుల విషయంలో ప్రత్యేక తనిఖీ. ” ఉపాధి పనులలో అవినీతి గురించి అనేక ఫిర్యాదులు మాకు క్రమం తప్పకుండా అందుతున్నాయి. రియల్ టైమ్ మానిటరింగ్, సాక్ష్యాలను సేకరించడం కోసం డ్రోన్లు ప్రత్యేకంగా సహాయపడతాయి” అని డ్రోన్ల వినియోగంపై సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించటం గమనార్హం. ఉపాధి కార్మికులకు చెక్ పెట్టేందుకు ప్రవేశపెట్టిన రెండవ అతిపెద్ద సాంకేతిక జోక్యం ఇది అని కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదులు, శత్రుదేశాల మీద, దేశ రక్షన కోసం ఉపయోగించాల్సిన డ్రోన్లనుఉపాధి హామీ వంటి ఒక పథకంలో వినియోగించటం కార్మికులను అవమానించే చర్య అని ఆరోపించాయి. ఈ ఏడాది మే 2022 నుంచి కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ ఆధారిత అప్లికేషన్ని ఉపయోగించి అన్ని వర్క్సైట్ల హాజరును తప్పనిసరిగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు గుర్తు చేశాయి. ”సమర్థవంతమైన పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం కోసం, వర్చువల్‌గా పనుల ధృవీకరణ కోసం అంబుడ్స్పర్సన్ డ్రోన్ టెక్నాలజీ సౌకర్యాలను ఉపయోగించవచ్చని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది” అని ఎస్ఓపీ పేర్కొన్నది. అంబుడ్యూస్పర్సన్లకు అవసరమైన విధంగా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
అదనపు నిధులు లేవు
అయితే, ఈ డ్రోన్లను మోహరించడానికి కేంద్రం రాష్ట్రాలకు ఎటువంటి అదనపు నిధులను అందించడం లేదు. మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ నుంచి అవసరమైన నిధులను తీసుకోవలసి ఉంటుంది. ఇది రాష్ట్ర ఉపాధి బడ్జెట్లో దాదాపు 10 శాతం కావటం గమనార్హం. డ్రోన్లను కొనుగోలు చేయడం కంటే, ఈ ప్రయోజనం కోసం డ్రోన్లలో ప్రత్యేకత కలిగిన ఏజెన్సీలను నియమించుకోవాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ ప్రయోజనాల కోసం డ్రోన్ల నుంచి సేకరించిన వీడియోలు, ఫోటోలను నిల్వ చేయడానికి కేంద్రీకృ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
‘ఉపాధిని దూరం చేసే చర్య’
కేంద్రంలోని మోడీ సర్కారు ఉపాధి హామీ పథకంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. బడ్జెట్లో కోతలు విధించటమే కాకుండా.. సాంకేతికత పేరుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని దూరం చేసే చర్యలను బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నదని ఆరోపించాయి. ఇలాంటి నిర్ణయాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.