– రాజస్థాన్ టు హైదరాబాద్‌కు హెరాయిన్
– ఇద్దరిని అరెస్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు
– 80 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
బట్టల వ్యాపారం ముసుగులో రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50లక్షల విలువగల 80గ్రాముల హెరాయిన్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన అశోక్‌కుమార్ బీ-ఫార్మసీ చదువుతున్నాడు. మరో బాలునితో కలిసి మాదక ద్రవ్యాలను సేవించేవాడు. వాటికి బానిసైన ఇద్దరికీ డబ్బులు లేకపోవడంతో డ్రగ్స్ సరఫరా చేసి సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన ఓ డ్రగ్స్ సరఫరాదారునితో చేతులు కలిపారు. గ్రాము హెరాయిన్‌ను రూ.5000కు కొనుగోలు చేసిన నిందితులు కావాల్సిన వారికి, తెలిసిన వారికి రూ.6000కు విక్రయించారు. దాంతో సులువుగా డబ్బులు వస్తుండటంతో హైదరాబాద్‌లో సైతం హెరాయిన్ విక్రయించాలని ఆలోచించిన నిందితులు బట్టల వ్యాపారం పేరుతో తీసుకొస్తున్నారు. గ్రాము హెరాయిన్ రూ.10వేల నుంచి 12 వేల వరకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి హయత్‌నగర్ శివారు ప్రాంతంలో ప్రత్యేక నిఘా వేసి నిందితులను అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా, వినియోగించినా చట్టప్రకారం నేరమని, వారికి 10ఏండ్లు లేదా యావజ్జీవ జైలు శిక్షతోపాటు జరిమానా పడే అవకాశముందని సీపీ తెలిపారు. డ్రగ్స్ వినియోగించి జీవితాన్ని పాడుచేసుకోవద్దన్నారు. ఈ సమావేశంలో ఎస్‌వోటీ డీసీపీ కే.మురళీధర్, ఇన్‌స్పెక్టర్ సుధాకర్, హయత్‌నగర్ పోలీసులు ఉన్నారు.