రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

– శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారుల నిఘా
– చందానగర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
నవతెలంగాణ-శంషాబాద్‌/చందానగర్‌
దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ విక్రయించాలనే లక్ష్యంతో అక్రమ మార్గాల ద్వారా స్మగ్లర్లు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు చందానగర్‌ పరిధిలో డీఆర్‌ఐ అధికారులు, పోలీసులు రూ.7కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రగ్స్‌ తరలిస్తున్నట్టు ముందస్తు సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు.. అక్టోబర్‌ 31న బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు వ్యక్తుల లగేజ్‌ని చెక్‌ఇన్‌లో భాగంగా తనిఖీ చేశారు. అందులో 13 వాక్యుమ్‌ ప్యాకెట్ల లోపల కెల్లోస్‌ చాక్లెట్లు కనిపించాయి. వాటిని ఆకుపచ్చని రంగులో ఉన్న ఫోమ్‌లో చుట్టి ఉంచారు. స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని పరీక్షించగా మరిజున అని తేలింది. స్వాధీనం చేసుకున్న 7.096 కిలోల హైడ్రోపోనిక్‌ వీడ్‌ విలువ.. రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ 1985 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చి రాజస్థాన్‌, హైదరాబాద్‌, విజయవాడలో అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని రంగారెడ్డి జిల్లా చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అరెస్ట్‌ చేశారు. అతని నుంచి 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుల్మాహర్‌ పార్కు కాలనీ ఇంటి నెంబర్‌ 56లో ఎండీఎంఏ డ్రగ్స్‌ ఓ వ్యక్తి దగ్గర ఉన్నట్టు సమాచారం అందుకున్న చందానగర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రఘు.. క్లూస్‌ టీమ్‌తో వెళ్లి దాడులు నిర్వహించి కృష్ణారాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.