నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ముందెన్నడూలేని విధంగా మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను సేకరిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎంఆర్ విషయంలో తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలతో, ఏండ్ల తరబడి బియ్యం అప్పగింతలో మిల్లర్లు చేస్తున్న జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో సీఎంఆర్ రికార్డుస్థాయిలో సేకరించినట్టు పేర్కొన్నారు. అధికారులందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.