మళ్లీ డీఎస్సీ 6,612 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

DSC again
Recruitment of 6612 Teacher Posts– 5,089 టీచర్‌, 1,523 ప్రత్యేక టీచర్‌ ఖాళీలు
– టీఆర్టీ స్థానంలో డీఎస్సీ ద్వారా నియామకాలు
– రేపు నోటిఫికేషన్‌ జారీ
– 9,979 పోస్టులకు త్వరలో పదోన్నతులు :విద్యామంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 6,612 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇందులో 5,089 ఉపాధ్యాయ పోస్టులు, 1,523 ప్రత్యేక (డిజెబుల్డ్‌) టీచర్లకు సంబంధించిన ఖాళీలున్నాయని వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కాకుండా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోనే జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాల ప్రక్రియను చేపడతామని అన్నారు. శనివారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులున్నాయని వివరించారు. అందులో 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు. 1,947 గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ పోస్టులకు, 2,162 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు, 5,870 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు కలిపి 9,979 పోస్టులకు త్వరలో పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. 5,089 ఉపాధ్యాయ పోస్టులను, 1,523 ప్రత్యేక టీచర్‌ పోస్టులు కలిపి 6,612 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా నేరుగా నియామకాలను చేపడతామని వివరించారు. 5,089 పోస్టుల్లో 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌, 2,575 ఎస్జీటీ, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులున్నాయని అన్నారు. ఈ డీఎస్సీకి కలెక్టర్‌ చైర్మెన్‌గా వ్యవహరిస్తారని, వైస్‌ చైర్మెన్‌గా అదనపు కలెక్టర్‌, సభ్యకార్యదర్శిగా డీఈవో, జిల్లా పరిషత్‌ సీఈవో సభ్యులుగా ఉంటారని చెప్పారు. గతంలో ఉన్నట్టుగానే నియామకాల ప్రక్రియ ఉంటుందన్నారు. విధివిధానాలను రూపొందించి శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలపై హైకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. బదిలీలు, పదోన్నతులను చేపడతామని వివరించారు. ఆ ప్రక్రియ తర్వాత ఉపాధ్యాయ ఖాళీలు ఇంకా మిగిలితే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తామని అన్నారు.
విద్యారంగానికి సీఎం పెద్దపీట
విద్యారంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యకు రూ.9,518 కోట్లు ఖర్చు చేస్తే, 2023-24 బడ్జెట్‌లో రూ.29,611 కోట్లు కేటాయించామని వివరించారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా 1,002 గురుకులాలను ప్రారంభించామన్నారు. అక్కడ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. గురుకులాలకు 2014-15లో రూ.973.37 కోట్లు ఖర్చు చేస్తే, 2023-24 బడ్జెట్‌లో రూ.4,049.01 కోట్లు కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు కలిపి 1,575 జూనియర్‌ కాలేజీలున్నాయని అన్నారు. పాఠశాల విద్యాశాఖలో మార్పు కోసం మన ఊరు-మనబడి పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు మూడు దశల్లో రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో విద్యారంగానికి రూ.1,87,269 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2017లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్టీని నిర్వహించామని చెప్పారు. వచ్చేనెల 15న టెట్‌ రాతపరీక్ష ఉంటుందన్నారు 27న ఫలితాలను విడుదల చేస్తామని అన్నారు. ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 3,140 వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియ టీఎస్‌పీఎస్సీ ద్వారా కొనసాగుతున్నదని ఆమె చెప్పారు. 3,896 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించామని వివరించారు. ఇంటర్‌, డిగ్రీ, వర్సిటీల్లో 742 పోస్టులను గ్రూప్‌-4 ద్వారా భర్తీ అవుతున్నాయని అన్నారు. 475 కేజీబీవీల్లో 1,264 టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సంబంధించి మరో 20 కేజీబీవీలను ఈ ఏడాది నుంచి ప్రారంభించామన్నారు. గురుకులాల్లో 11,715 పోస్టులను భర్తీ చేశామని అన్నారు. ఇప్పుడు 12,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించా రు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ-2023 పోస్టుల వివరాలు కేటగిరీ పోస్టులు
స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 1,739
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) 2,575
లాంగ్వేజ్‌ పండితులు (ఎల్పీ) 611
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) 164
మొత్తం 5,089
ప్రత్యేక (డిజెబుల్డ్‌) టీచర్లు 1,523
మొత్తం 6,612