డీఎస్సీకి ఆదరణ కరువు

DSC lacks popularity– గతం కంటే లక్షకుపైగా తగ్గిన దరఖాస్తులు
– ఈసారి 1.76 లక్షల మంది అప్లై
– టెట్‌ కంటే మరింత తక్కువ
– 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకే నోటిఫికేషన్‌
– అన్ని జిల్లాల్లో పలు సబ్జెక్టులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులే లేవు
– ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ వారికి అవకాశం లేదు
– ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ)కి ఆదరణ కరువైంది. బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసి టెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసేందుకు ఆసక్తిని కనబరచలేదు. అందుకే గతం కంటే లక్షకు పైగా దరఖాస్తులు తగ్గడం గమనార్హం. 2017, అక్టోబర్‌ 21న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2,77,574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మళ్లీ ఆరేండ్ల తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బీఎడ్‌, డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు పెరిగారు. ఆరేండ్ల తర్వాత నోటిఫికేషన్‌ రావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేయాల్సి ఉంది. కానీ ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. ఉపాధ్యాయ పోస్టులు తక్కువగా భర్తీ చేస్తుండడమే ఇందుకు కారణంగా ఉన్నది. అన్ని జిల్లాల్లో పలు సబ్జెక్టులకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులే లేవు. పోస్టుల్లేకపోవడంతో అభ్యర్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేయలేదు. ఎస్‌ఏ, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ), ఎల్‌పీ, పీఈటీ పోస్టులకు సంబంధించి కొన్ని రిజర్వేషన్‌ కేటగిరీల వారికి కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా అతి తక్కువగా ఉన్నాయి. అందుకే ఈసారి కేవలం 1,79,297 మంది ఫీజు చెల్లించారు. వారిలో 1,76,530 మంది దరఖాస్తు చేశారు. అంటే గతసారి కంటే ఇప్పుడు 1,01,044 దరఖాస్తులు తగ్గడం గమనార్హం.
తక్కువ పోస్టులే ప్రధాన కారణం
రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ ఆరో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. గతనెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు 1,76,530 మంది దరఖాస్తు చేశారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చేనెల 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో జరిగే రాతపరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. డీఎస్సీకి తక్కువ దరఖాస్తులు రావడానికి ప్రధాన కారణం తక్కువ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే. అందులోనూ సగానికిపైగా పోస్టులు మహిళలకే ఉన్నాయి. కొన్ని సబ్జెక్టుల పోస్టులు చాలా జిల్లాల్లో అందుబాటులో లేవు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు. తక్కువ పోస్టులున్నా దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి ఉన్నది. డీఎస్సీకి దరఖాస్తులు తగ్గడానికి ఇలా అనేక కారణాలున్నాయి. అందుకే 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పోస్టులకు 66,083 మంది, 611 లాంగ్వేజ్‌ పండితులు (ఎల్‌పీ) పోస్టులకు 12,270 మంది, 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టులకు 6,789 మంది, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు 91,388 మంది కలిపి మొత్తం 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,76,530 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు
టెట్‌ కంటే డీఎస్సీకే తక్కువ దరఖాస్తులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు వచ్చిన ఆదరణ కూడా డీఎస్సీకి రాలేదు. టెట్‌ రాసేదే ఉపాధ్యాయ పోస్టులను సాధించడం కోసం. అలాంటి ఉపాధ్యాయ ఖాళీలకు నోటిఫికేషన్‌ వచ్చినా అభ్యర్థుల నుంచి సరైన స్పందన రాకపోవడం గమనార్హం. గతనెల 15న టెట్‌ పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారిలో 2,23,582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారిలో 1,90,047 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వారిలో 29,073 (15.30 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2కు భారీ సంఖ్యలో దరఖాస్తులొచ్చాయని పై గణాంకాలే నిదర్శనం. కానీ డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు విముఖత చూపారు. కేవలం 1,76,530 దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం.
ఉపాధ్యాయ పోస్టులు, దరఖాస్తుల వివరాలు
కేటగిరీ టీఆర్టీ-2017 డీఎస్సీ-2023
పోస్టులు దరఖాస్తులు పోస్టులు దరఖాస్తులు
ఎస్‌ఏ 1,941 1,45,158 1,739 91,388
ఎస్జీటీ 5,415 89,149 2,575 66,083
ఎల్‌పీ 1,011 24,219 611 12,270
పీఈటీ 416 16,871 164 6,789
ఎస్‌ఏపీఈ 09 2,177 — —
మొత్తం 8,792 2,77,574 5,089 1,76,530