డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల

– 20 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ
– పాఠశాల విద్యాశాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీతోపాటు రెస్పాన్స్‌ షీట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండితులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేశామని వివరించారు. వాటికోసం www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రాథమిక కీపై ఈనెల 20న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను అభ్యర్థుల నుంచి స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను helpdeskdsc2024@gmail.com పంపించాలని కోరారు. భౌతికంగా అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. గతనెల 18 నుంచి ఈనెల ఐదో తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో డీఎస్సీ రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 (87.61 శాతం) మంది అభ్యర్థులు రాతపరీక్షలకు హాజరయ్యారు. 34,694 (12.39 శాతం) మంది గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.