– ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల ఐదో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సారిగా డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. డీఎస్సీ రాతపరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా డీఎస్సీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈనెల 11 నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 2,48,851 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. డీఎస్సీకి 2,79,957 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే. ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు వెంటనే చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు రోజూ రెండు విడతల్లో రాతపరీక్షలను నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం తొమ్మిది నుంచి 11.30 (స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహా) గంటల వరకు జరుగుతుంది. రెండో విడత మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 (స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహా) గంటల వరకు నిర్వహిస్తారు. మొదటి విడతకు ఉదయం 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ఉదయం 8.45 గంటలకు గేట్లను మూసేస్తారు. రెండో విడతకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు గేట్లను మూసేస్తారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడతలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. డీఎస్సీ అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తారు. అందుకే పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఫొటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు.