నేర రహిత నల్లగొండగా తీర్చిదిద్దుదాం: డీఎస్పీ శివరాం రెడ్డి

Let's make Nalgonda crime free: DSP Sivaram Reddy– ప్రజా ప్రతినిధులు భాగస్వాములు అవ్వాలి
– ఆగస్టు చివరి నాటికి సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా కృషి
– సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్  ఆదేశాలతోపట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా  కృషి చేస్తున్న పోలీసులతో ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి కోరారు.నల్లగొండ పట్టణ వన్ టౌన్, టూ టౌన్, రూరల్ వివిధ కాలనీల ముఖ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతో డి.ఎస్.పి కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడం కోసం పోలీసులు కృషి చేస్తున్నారని, ఇందులో ప్రజలు భాగస్వాములైనప్పుడే సులభంగా ఫలితాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు, నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలో నేరాలు జరగకుండా నివారించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. అదే సమయంలో ఇప్పటికే పలు కాలనీలలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా చూడాలన సూచించారు. గంజాయి విక్రయాలు, గంజాయి సేవిస్తున్న వారిని గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువత గంజాయి బారినపడి తమ బంగారు భవిష్యత్తుకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తూ వారు పెడదోవ పట్టకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రజలు తమ ఇళ్లలో, కాలనీలలో, అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాటి సంబంధిత పోలీస్ స్టేషన్‌లతో అనుసంధానం చేయడం ద్వారా దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు వాటిని సులువుగా పరిష్కరించి అవకాశం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇకనుండి పట్టణంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్, రిలేటెడ్ కమ్యూనిటీ కాలనీల అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డులలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని, దీనికి సంబంధిత వార్డుల కౌన్సిలర్లు తమకు సహకరించాలని ఆయన కోరారు.ఈ అవగాహన సదస్సులో పట్టణ వన్ టౌన్, టూ టౌన్ సి.ఐలు ఏమి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డానియల్ కుమార్, ట్రాఫిక్ సిఐ బిట్టు క్రాంతి కుమార్, ఏస్ ఐ లు సందీప్ రెడ్డి, మానస, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సమద్,బాబా, గడిగ శ్రీను, నవీన్ గౌడ్  అభిమన్యు, శ్రీనివాస్, ఇంతియాజ్, యూత్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.