బకాయిలు చెల్లించి సీఎంపీఫ్‌ చిట్టీలు అందజేయాలి

NavatelanganaNewsనవతెలంగాణ-నస్పూర్‌
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.27 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే కార్మికులకు సీఎంపీఎఫ్‌ చిట్టీలు అందజేయాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు, శాశ్వత వేజ్‌ బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఆర్కే-5 గని ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం సంస్థ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్లించకుండా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరికీ రెండు గుంటల భూమి, రూ.20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇప్పించాలన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కాబట్టి నూతన బొగ్గు బావులను ఏర్పాటు చేయాలన్నారు. ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి యాజమాన్యం పెరిక్స్‌ పై ఆదాయ పన్నును అధికారులకు యాజమాన్యమే చెల్లిస్తుందని కానీ కార్మికులకు ఎందుకు చెల్లించడం లేదని వారికి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా, ఏరియా కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, ఫిట్‌ కార్యదర్శిలు గునిగంటి నరసింగరావు, రామచందర్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ బెల్లంపల్లి రీజియన్‌ కార్యదర్శి అప్రోజ్‌ ఖాన్‌, ట్రేడ్మేన్స్‌ నాయకులు సురేష్‌, యాదగిరి సత్యనారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి లక్కిరెడ్డి, సత్తిరెడ్డి, జీపీ రావు, దేవేందర్‌ పాల్గొన్నారు.