కేరళకు బకాయిలు

–  చెల్లింపుల్లో కేంద్రం జాప్యం : బాలగోపాల్‌
కొచ్చి : సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం కేరళకు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తోందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ విమర్శించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన దానితోపాటు ఇతర బకాయిల్లో కొంత భాగాన్ని రాష్ట్రానికి కేంద్రం చెల్లించాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ విధంగా చెల్లింపుల తిరస్కరణ కేంద్ర-రాష్ట్ర సంబంధాల స్ఫూర్తికి విఘాతమని అన్నారు. కొచ్చిలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలను బానిస-యజమాని బంధంగా నిర్భంధించకూడదని అన్నారు. .సాంఘిక సంక్షేమ పెన్షన్‌తో సహా కొన్ని బకాయి చెల్లింపులను మాత్రమే కేంద్రం చేసిందని మంత్రి తెలిపారు. ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయింపు రేటు 3.9 శాతం నుంచి ఇప్పుడు 1.9 శాతానికి తగ్గిందని మంత్రి చెప్పారు. కనీసం 2.5 శాతం ప్రకారం చెల్లించినప్పటికీ, కేరళకు రూ. 8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్లు వరకూ అదనంగా రావాలని తెలిపారు. కేరళ, కేంద్రం మధ్య సంబంధాలు కేవలం ఆర్థిక సమస్యల్లోనే చిక్కుకోలేదని, రాజకీయ, పాలనాపరమైన సమస్యలు కూడా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సభ్యుల సంఖ్యపై నియంత్రణ తీసుకురావడం కేరళ వంటి రాష్ట్రాలు ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా తెలిపారు. దీంతో కేరళ వంటి రాష్ట్రంలో 20 లోక్‌సభ స్థానాలు దాదాపు 12కి తగ్గుతాయని, కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో 50 శాతం పెరగనున్నాయని ఆయన చెప్పారు.