ఎవరూ నీళ్ళు పోసి పెంచకపోయినా పొడవుగా, బలంగా, దారికి అడ్డంగా అనేకంగా పెరిగిన చెట్లున్నాయి. పొడవుగా పెరగలేని ఆకాశంలోకి కొమ్మలు విసర్లేని పొదలు నేల మీద ఖాళీస్థలం వెతుక్కుంటూ పోతున్నాయి. కొండలున్నాయి, కొండల గుండెల్లో బండలున్నాయి. ఎక్కడిదాకా వెళ్ళి దభేలున కిందపడిపోతాయో తెలీని పరిగెత్తే నీళ్ళున్నాయి. ఎగుడు దిగుడు కాలి బాట మీద పచ్చిగా ఉన్న పచ్చిగడ్డీ, ఎండిపోయిన ఎండుగడ్డీ ఉన్నాయి. చెట్లకొమ్మల్లో గూళ్ళు, గూళ్ళలో పక్షులూ, కొమ్మల మీద వేలాడే కోతులూ ఉన్నాయి. అక్కడక్కడా పుట్టల్లో పాములు, గజిబిజిగా చీకటి చీకటిగా ఉన్న కొండరాళ్ళ మధ్య మాంసాహారం మాత్రమే తిని బ్రతికే మృగాలూ ఉన్నాయి.
అడవిలో దారితప్పి గుంపు నుంచి బయటకు వచ్చినందుకు తన్ను తానే తిట్టుకుంటూ భయంభయంగా దిక్కుతోచకుండా పరుగుతీస్తున్నదది. ఎండలో దాని ఒంటిని చట్టుకునున్న చర్మం నున్నగా మెరుస్తున్నది. సుకుమారంగా ఉన్న నడుము ఊయల్లా ఊగుతున్నది. దాని నాలుగు కాళ్ళూ గాలిలోనే కదుల్తున్నవి. అలసట తీర్చుకోవడం కోసం అది ఆగిన క్షణం దాని వెడల్పాటి కళ్ళల్లో వెలుతురు వణుకుతున్నది.
అడవిలో దారి కాచి ఒంటరిగా పొందలచాటున ఉన్న ఓ ఆకారం కదిలింది. గాలిలో తేలిపోతున్న ప్రాణిని అనుసరిస్తూ పొదల్లో కదిలింది. దాని పసుపు రంగు ఒంటిమీద నల్లని చారికలున్నవి. పెద్దతలలో గాజు గోలీల్లాంటి కళ్ళున్నాయి. నేలమీద పరిగెడ్తున్న దాని కాళ్ళల్లో పదునైన గోళ్ళున్నాయి. పదునైన పళ్ళున్న దానినోటిలోంచి అప్పుడప్పుడూ ఎర్రని నాలుక బయటకి వచ్చి సూదుల్లాంటి తెల్లని మీసాలను దువ్వుతున్నది.
వయసులో చిన్నది. ఎంత లేతగా ఉన్నది. ఆకలి ఆవురావురుమంటున్నది. చిక్కితే చీల్చేద్దును. పంటికి పని చెబ్దును. కానీ ఇది మెరుపు వేగంతో ఉరుకుతున్నది. దీన్ని అందుకోవడం సాధ్యమవునా కాదా అని ఆలోచనలో పడ్డది పొదలచాటున ఆయాసంతో రొప్పుతున్న పులి.
ఎంత వేగంగా పరుగెడ్తున్నా పక్కన పొదల్లో ఏదో కదలిక వినిపిస్తున్నది. అది ఒకవేళ ఫులే అయితే గుండె దడదడమంటున్నది. భయంతో అడుగులు తడబడుతున్నవి అనుకుంటున్నది జింక.
పరుగెడ్తూనే అరిచింది పులి. ఎందుకంత వేగంగా పరుగెడ్తావు. ఈ దట్టమైన అడవిలోకి దారితప్పి వచ్చినట్టున్నావు. నిన్ను అడవి దాటిస్తాను, కాస్త ఆగరాదూ కలిసి నడుద్దాం అంది నల్లచారల పసుపుకోటు పులి.
ఎవర్నీ నమ్మవద్దని చెప్పింది అమ్మ. నువ్వెవరో నాకు తెలీదు. నా దారిన నన్ను పోనీ. నా వెంటపడకు అంది గోధుమ రంగు తెల్లచారల కోటు జింక.
దారా? నీకే దారీ దొరకదు. నన్ను నమ్ము. నీ వెంట రానియ్యి, సరైన దారి చూపిస్తా.
ఊహూ! నీ సాయం వద్దు. అసలు నువ్వెవ్వరు. పులివా? జింకల్ని నమిలే పులివేనా? పంజాలో కత్తుల్లాంటి గోళ్ళు దాచుకున్న పులివేనా? అంది వణుకుతున్న గొంతుకతో జింక.
నువ్వన్నట్టు పంజా ఉన్న పులుల్ని నమ్మనేవద్దు. నేను జింకల్ని నమిలే పులిని కాను. నేనో వెజిటేరియన్ని. నీలాగే పండ్లూకాయలూ, పచ్చిగడ్డీ మాత్రమే తింటాను అంది పులి.
నేనెప్పుడూ పులిని చూలేదు కానీ నువ్వు పులివైతే ఇంత నెమ్మదిగా, ఇంత తియ్యగా మాట్లాడి వుండవు కదా అంది లేడి అమాయకంగా.
ఎప్పుడూ పులినిచూడని లేడి. ఇంకానయం అరిచాను కాను. దీన్ని పరుగులో అందుకోవడం కష్టం. ఎలాగైనా సరే లాలించి, బుజ్జగించి భోంచెయ్యాలి అనుకున్న పులి, లేడికి వినపడేంత దగ్గర్లో ఉన్నప్పుడల్లా నాలుకంట తేనెను కార్చసాగింది.
అదే అడవి! మరో వైపు చెట్ల మధ్య నుంచి పరుగెత్తుకు వస్తున్నదది. దారితప్పి గుంపులోంచి బయటకు వచ్చినందుకు భయంభయంగా దిక్కుతోచకుండా పరుగు తీస్తున్నదది. ఎండలో దాని ఒంటిని చుట్టుకునున్న నల్లని చర్మం మీద తెల్లని మచ్చలు చుక్కల్లా మెరుస్తున్నవి. ఎటునుంచి ఎటు పోవాలో తెలియడం లేదు. అడవి దాటి మందను చేరుకోగలనా అన్న చింత చితిలా కాల్చేస్తున్నది దాన్ని. అప్పుడప్పుడూ పరుగెడుతూ అలసిపోయినప్పుడు బెదురు చూపుల్తో చుట్టూ చూస్తూ నిదానంగా నడుస్తున్న దానికి వెనుక నుంచి ఎవరో వస్తున్న చప్పుడు వినిపించి ఉలిక్కి పడ్డది. ఒక్క ఉదుట్న పక్కనున్న పొదల్లో దూరి వణుకుతూ నిలబడింది. వచ్చింది రెండు కాళ్ళ మీద నడిచే మనిషి. పొద ఎదురుగ్గా వచ్చి నిలిచి ఎందుకు దాక్కున్నావు? నేను పులినేం కాదు, మామూలు మనిషిని. మనుషుల్ని ఎప్పుడూ చూళ్ళేదూ అన్నాడు మనిషి. చూశాను కానీ నీ గడ్డమూ మీసాలూ, నీఎర్రటి కళ్ళూ, భారీ శరీరమూ చూస్తే భమవేస్తున్నది అంది గొర్రె. పెద్దగా నవ్వాడు మనిషి. నీమీద దూకి పొట్ట చీల్చి తిండానికి గోళ్ళున్నాయా చూడు అన్నాడు. నిన్న నమ్మవచ్చునా అంది గొర్రె, కొంచెం స్తిమితపడి. నమ్మకపోతే ఈ అడవిలో ఎక్కడికి పోతావు? ఏ పులో చూసిందంటే నువ్వుండవు, నీ ఒంటి తోలూ, పొట్టికొమ్ములూ తప్ప ఏమీ మిగలవు అన్నాడు మనిషి. అడవి లోంచి బయటకు తీసుకుపోగలవా దారి తెలుసా అంది గొర్రె. నేనూ అడవిదాటి పోతున్నాను. నిన్నేం మోసుకు పోతానా. ఒకరి కొకరం తోడుగా ముచ్చట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. నిన్ను నీ మందలోకి చేర్చే భారం నాది అన్నాడు మనిషి. నమ్మాలో వద్దో అర్ధం కాలేదు గొర్రెకి. ఇంతకు ముందు ఇద్దరు మమషులు కనపడ్డారు. వాళ్ళూ తనని అడవి దాటిస్తామన్నారు కానీ, తను నమ్మలేదు. చీకటిపడితే అడవి దాటనేలేను. ఈ మనిషిని నమ్మితే ఏం అనుకున్న గొర్రె, నీ చేతుల్లో ఉన్న ఆ సంచి ఏమిటి? దాన్లో ఏముంది అనడిగింది. దారిలో ఆకలయితే తిండానికి తిండి తెచ్చికున్నానంతే. నేను వెళ్ళిపోతున్నా. నీ ఇష్టం నన్ను నమ్మితే నా వెంట వచ్చెయ్యి. లేకపోతే నీకే కష్టం నష్టం అన్నాడు మనిషి వెళ్ళిపోవడానికి కాలు కదిలిస్తూ.
పరుగెత్తి లేడిని అందుకోలేక పోయిన పులి మాటలు నమ్మేసింది లేడి., మనిషి దగ్గర పదునైన వెడల్పాటి కత్తి ఉందని తెలుసుకోలేక పోయింది గొర్రె. తనకు దారి చూపే రక్షకుడని అనుకున్నది పులిని ఎప్పుడూ చూడని జింక. తనను మందలోకి చేర్చే పరోపకారి అని కసాయిని నమ్మింది గొర్రె.
అలసట లేకుండా ఆయాసం రాకుండా జింకల్లాంటి మనుషుల్ని మోసం చేసే పులుల్లాంటి మనుషులు, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మరాదో తేల్చుకోలేక అమాయకంగా కసాయిని మాత్రమే నమ్మే గొట్టెల్లాంటి మనుషులు ఉండే చోటుని ‘లోకం’ అనే కదా అంటారు!
– చింతపట్ల సుదర్శన్
9299809212