– ఐదు లారీలకు రెవెన్యూ పర్మిషన్.. తరలింపు మాత్రం పది లారీలు
– కట్టడి చెయ్యటానికి జంక్కుతున్న అధికార యంత్రాంగం
– అసలు పాత్ర ఎవ్వరిది..? వెనుకున్న బడా నేతలు ఎవ్వరు..?
– సందిగ్ధంలో రెండు మండలాల ప్రజలు
– ట్రాక్టర్లు కట్టడి చేసి లారీల్లో తరలింపు పై ఎన్నో అనుమానాలు..?
– ఉప్పునుంతల మండల ప్రజలు కన్నెర్ర జేసినందుకే ఇసుక తరలింపుకు బ్రేక్ పడిందా..?
– వంగూర్ మండలంతో లారీల ఒప్పందంపై పలు అనుమానాలు..?
– మండలాలు వేరైనా దుందుభి నది ఒక్కటేగా..?
– లారీలతో దుందుభిని కొల్లగొడుతున్నారని మండిపాటు
నవతెలంగాణ – ఉప్పునుంతల
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అయితేనెం భారీ వాహనాల్లో పరిమితికి మించి ఓవర్లోడుతో ఇసుకను తరలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామంలో మైనింగ్,రెవెన్యూ అధికారుల ఎలాంటి పర్మిషన్ లేకుండా కొద్ది రోజులు అక్రమంగా భారీ వాహనాల్లో ఇసుకను తరలించారు. తరువాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడం వల్ల దానిని కొద్దీ రోజులు నిలిపేశారు. ఎన్నికలు అనంతరం మళ్లీ అదే తంతు కొనసాగించే దిశగా ప్రయత్నం చేస్తే ఉప్పునుంతల మండల కేంద్రంలో స్థానిక ప్రజలు మా రోడ్లు పాడైపోతున్నాయని వాహనాలు ఆపి నిలదీశారు. దాంతో ఇసుక రవాణా నిలిపివేశారు. కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్లే అడ్డుపడుతున్నారని గ్రహించి అనంతరం వంగూరు మండలం వైపు కన్నేశారు ఇసుక మాఫియా.కొద్దీ రోజులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా సాగిస్తే కల్వకుర్తి పట్టణంలో పోలీసులు లారీలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. అప్పటినుండి కొద్దిరోజులు విరామం తీసుకుని మళ్లీ వంగూర్ మండలం ఉల్పర గ్రామంలో లోడింగ్ మొదలు పెట్టారు. ఐదు లారీలకు రెవెన్యూ పర్మిషన్ పొంది 15 లారీలల్లో పరిమితికి మించి ఓవర్ లోడ్ తో ఉప్పునుంతల మండల కేంద్రం నుండి అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలకు ఒక్కో లారీ దూరాన్ని బట్టి 35 వేల నుండి 40 వేల వరకు విక్రయాలు జోరందుకున్నాయి. పర్మిషన్లు ఒక లారీపై తీసుకొని వాటిని చెరిపేసి మరో లారీ నంబర్లను అక్కడ చేర్చి దర్జాగా ఇసుక తరలిస్తున్నారు.దీనిపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైందని తెలుస్తుంది. అంతేకాకుండా రెవెన్యూ అధికారులు రాసిచ్చిన పర్మిషన్ పత్రాల్లో ఒకటి రెవెన్యూ కార్యాలయంలో మరొకటి పోలీస్ స్టేషన్లో ఒకటి ఇసుక తరలించే వాహనంలో భద్రపరచాలి కానీ చట్టానికి విరుద్ధంగా పోలీసులకు ఇవ్వాల్సిన పత్రాలు కూడా వాహనాల్లోనే ఉండటం ఆశ్చర్య పడాల్సిన విషయం అంటే ఏ స్థాయిలో అక్రమ ఇసుక దందా కొనసాగుతుందో ఇట్టే అర్థమయిపోతుంది. ఇది ప్రభుత్వ అధికారులు షేమ్గ్ భావించాల్సిన విషయం. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెండు మండలాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దెబ్బ తగలడానికి ఏ రాయి అయితే ఏముంది ఏ మండలం నుండి ఇసుక తరలిస్తే ఏముంది దుందుభినది ఒక్కటేగా భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇబ్బందులకు గురికావడానికి అంటూ ప్రజలు కామెంట్ చేస్తున్నారు.
జంక్కుతున్న అధికారులు:
వంగూర్ రెవెన్యూ శాఖ నుండి అనుమతులు పొంది ఉప్పునుంతల రెవెన్యూ, పోలీస్ కార్యాలయాల ముందు నుండే ఓవర్ లోడ్ తో సమయపాలన లేకుండా వెళ్తున్న వాహనాలను కట్టడి చెయ్యటంలో అధికారులు జంకుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గృహ నిర్మాణాల అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తే పోలీసులు పట్టుకొని భారీ జరిమానాలతో కోర్ట్ కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఇంత పెద్ద మొత్తంలో పరిమితికి మించి ఓవర్ లోడ్ తో లారీల్లో ఇసుక తరలిపోతుంటే ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అసలు పాత్ర ఎవరిది..? వెనుకున్న బడా నేతలు ఎవరు..?
ఇంత పెద్ద మొత్తంలో భారీ వాహనాల్లో ప్రతినిత్యం వాహనాల్లో ఇసుక తరలిపోతుంటే పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని అసలు ఎవరి పాత్ర ఉంది..? వాటి వెనుక ఉన్న బడా నేతలు ఎవరంటూ..? ప్రజలు సందిగ్ధంలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం ట్రాక్టర్ల ద్వారానే ఇసుక తరలిపోయింది కానీ ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేస్తుందనుకుంటే అంతకుమించి ఇసుక భారీ వాహనాల్లో తరలిపోతుందని ప్రజలు ఆశ్చర్యము వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అసలు పాత్ర ఎవరిది..? దీని వెనుకున్న బడానేతలు ఎవరని..? ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
స్థానిక చోట మోట నేతలు ట్రాక్టర్ల ద్వారా దుందుభి నది నుండి ఇసుక తరలిస్తుంటే వాటిని నిలిపేసి ప్రస్తుతం భారీ వాహనాల ద్వారా ప్రతినిత్యం ఇసుక తరలిపోతుంటే దీని వెనుక రాష్ట్రస్థాయి నేతల కనుసన్నుల్లోనే ఈ తతంగం అంతా కొనసాగుతుందని ప్రజలు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే దాదాపు కొద్ది రోజుల్లోనే దుందుభినది లూటీ కావడం ఖాయమని చుట్టుప్రక్కల ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రకృతి సంపదను కొల్లగొట్టి స్థానికేతరులు సొమ్ము చేసుకోవడం సరైన పద్ధతి కాదని దుందుభినది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
మన ఊరు మన ఇసుక ప్రభుత్వ పాలసీ ఎక్కడ..?
గ్రామాల్లో వేసవి కాలంలో చిన్న పెద్ద ఇళ్ల నిర్మాణానికి ఇసుక అవసరం ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చి తక్కువ ధరలో ఇంటివద్దకే ఇసుక పంపిణీ కొనసాగుతుంది అని చెప్పారు.కానీ ఇప్పటి వరకు రేపు మాపు అంటూ వర్షాకాలం సమీపిస్తుంది కానీ నేటి వరకు ఆ పాలసీ అమలు దిశగా ప్రయత్నం లేదు.కానీ భారీ వాహనాల్లో ప్రతి నిత్యం నియోజకవర్గ వ్యాప్తంగా తరలిపోతుంది ఒక్కో లారీకి 35 నుండి 40 వేలు ధర నిర్ణయించారు. కానీ ఒక్క ట్రాక్టర్ అవసరమున్న చిన్న ఇల్లు లేదా ప్యాచ్ వర్క్స్ చేసుకునే పేదల పరిస్థితి ఏంటని ప్రజలు మండిపడుతున్నారు.అయ్యా ప్రభుత్వ ఇసుక పాలసీ ఎక్కడ అంటూ..ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా బడా బాబులకు కొమ్ముకాయకుండా ప్రభుత్వ పాలసీ విధానాన్ని అమలు చేసి పేద ధనిక తేడా లేకుండా అందరికీ అందుబాటులో ధర ఉండే విధంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.