కొంతమంది మనుషులు పూర్తిగ బానిసలుగా వుంటరు. యజమాని ఎట్ల చెప్పుతే అట్లనే కానీ స్వంత తెలివి అసలే ఉపయోగించరు. ఉపయోగించినా యజమాని అనుమతించడు. అట్లనే ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నడట’ అంటరు. అసలు దున్నపోతు ఈనుతదా, బర్రె ఈనుతది గదా అని వివేచనతో ఆలోచించరు. ఆలోచించినా మనం ఏమంటం? ఊ అంటే సరిపోతది అనుకుంటరు. ఆ యజమాని పనివాల్లు అట్లనే ఉండే పద్ధతి ఇది. ఇట్లాంటి వాల్లను చూసే ‘దున్నపోతుకు సున్నం వేస్తే ఆవు అవుతుందా’ అనే సామెత పుట్టింది. ఎట్లైనా ఆవు ఆవే. పోతు పోతే గదా. నిజానికి దున్నపోతుకు కష్టమెక్కువ. బర్రెకు కష్టాలు వుండవు. అవి ఊరంతా తిరిగి గడ్డి తిని పాలు ఇస్తయి. కానీ దున్నపోతులకి మాత్రం నాగలి దున్నడం పని వుంటుంది. వీటికి కష్టం, వాటికి సుఖం వుంటది. అందుకే ‘దున్నపోతు లెక్క కష్టపడాలె దొర లెక్క తిరగాలె’ అంటరు. దొరతనం కూడా అంతే కదా. కష్టం తక్కువ, సుఖం ఎక్కువ. ఎవరినైనా తిట్టేటప్పుడు కూడా ‘దున్నపోతు’ అని తిడుతరు. నిజానికి అది పనులు చేస్తది. శ్రమజీవి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘దున్నపోతు లెక్కన్నవు గా తోలు మంద్రం రాదా’ అని అంటరు. అందుకే వాటిని ఎనపయి అని కూడా అంటరు. ఇనుము లెక్క ఉంటాయని కావచ్చు. రోడ్ నుంచి బండి మీద వెళ్తుంతే దున్నపోతు కన్పిస్తే తాకుతదని కావచ్చు భయపడతరు. వాటికి దూరంగా వెళ్లిపోతుంటరు. వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎవరినైనా ఏమన్నా అనదలిస్తే వాన్ని ఏమంటే ఏం లాభం ఎన్ని అన్నాగానీ ‘దున్నపోతు మీద వాన పడ్డట్టు’ అని అంటరు.
అట్లనే ఎక్కడైనా పని చేసే వాల్లతోనే పని చేపిస్తరు. పని రానివాల్లకు అసలు ఏ సంస్థలోనూ పట్టించుకోరు. చెయ్యని వాల్లను ఏమనరు. చేసేవాల్లు చిన్న తప్పు చేస్తే ఇబ్బంది అయితది. అటువంటప్పుడు ‘దున్నే ఎద్దునే ముల్లుగర్రతో పొడుస్తరు’ అని అంటరు.
– అన్నవరం దేవేందర్, 9440763479