చంద్రబాబు, పవన్‌ పర్యటనలో రాయి కలకలం

చంద్రబాబు, పవన్‌ పర్యటనలో రాయి కలకలంగుంటూరు : విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనల్లో రాళ్ల కలకలం రేగింది. వీరిపై రాళ్ల దాడి ప్రచారం వైరల్‌ అయింది. విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం సాయంత్రం చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి సభా వేదిక దగ్గరగల బారికేడ్ల వద్ద పడింది. దీంతో, కొద్ది నిమిషాల సేపు చంద్రబాబు తన ప్రసంగాన్ని నిలుపుదల చేశారు. పోలీసులు రాయి పడినట్లు చెప్తున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అయితే, బారికేడ్ల కిందిన మాత్రమే రాళ్లు ఉన్నాయి. అక్కడికి సమీపంలో ఎవరైనా ఉన్నారేమోనని వెతకారు. ఎవరూ కనిపించలేదు. ఈ తర్వాత చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఈ రాయినే చంద్రబాబుపైకి విసిరారంటూ ఒక టీడీపీ కార్యకర్త ఒక రాయినిపైకి ఎత్తి చూపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్లో తెనాలిలోని సుల్తానాబాద్‌ చేరుకున్నారు. సుల్తానాబాద్‌ నుంచి బహిరంగ సభ స్థలం గాంధీ మార్కెట్‌కు ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీకి వచ్చిన మామిళ్లపల్లికి చెందిన జనసేన కార్యకర్త దిలీప్‌ ఒక యువతి పట్ల సుల్తాన్‌బాద్‌లోని ఉషోదయ కల్యాణ మండపం వద్ద అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలిసి ఆ యువకుడిని యువతి తండ్రి నిలదీశారు. ఈ సమయంలో అటుగా ర్యాలీగా వస్తున్న జనసేన కార్యకర్తలు దిలీప్‌ను కొట్టారు. దీంతో, ఆ యువకుడు వారిపై రాయి విసిరినట్లు అక్కడివారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న జనసేన కార్యకర్తలు పవన్‌ కల్యాణ్‌పైనా ఆ యువకుడు రాయి విసిరాడని భావించి దేహశుద్ధి చేశారు. దీంతో, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి తండ్రిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పొరపాటు తనే చెయ్యి యువతికి తగిలిందని దిలీప్‌ వివరణ ఇచ్చాడు.
రాయిపై ఇంటెలిజెన్స్‌ వర్గాలేమంటున్నాయంటే!
‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభ చుట్టుపక్కల బలగాలతో ఇళ్లపైనా బందోబస్తు ఏర్పాటు చేశాం. బాబు ప్రసంగిస్తున్న స్టేజీకి ఎడమవైపునగల ఒక చెట్టువద్ద అలికిడి జరిగితే అంతా రాయి రాయి అంటూ అరిచారు. మేమెళ్లి చూశాము. అక్కడేమీ కనిపించలేదు. ఒక రాయి చెట్టుపైనుంచి స్టేజీ వద్ద ఇనుప బారికేడ్లకు తగిలిందని చెప్పడంతో అక్కడ చూశాం. బారికేడ్లకు కింద స్టేజీ కోసం కొన్ని పలక లాంటి రాళ్లు పెట్టినవి మినహా ఇంకెలాంటి రాళ్లు లేవు’ అని ఇంటెలిజెన్స్‌ పోలీసులు తెలిపారు.