గత పదేళ్ల కాలంలో రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరింది: సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, అందుకు ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రైతు భరోసా, రైతు రుణమాఫీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరిందని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ తలచుకుంటే రాష్ట్రానికి ఉన్న రూ.7 లక్షల కోట్లు అప్పు కట్టేయగలదని సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్న నాడు బీఆర్ఎస్  ప్రతీది వ్యాపారంగానే మార్చేసిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోయిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట కట్టుబడి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని.. ఆమె ఇంటికెళ్లి కేసీఆర్ ఫ్యామిలీ  కాళ్లు మొక్కిందని గుర్తు చేశారు. కానీ, కృతజ్ఞత మరిచి బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల భారంతో తమకు అప్పగించారని తెలిపారు. 16 మంత్రి సీఎంలు కలిసి రూ.72 వేల కోట్ల అప్పులు చేస్తే.. రూ.72 వేల కోట్ల అప్పుతో అనేక ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు. గత పదేళ్లలో సర్కార్ ‘కూలేశ్వరం’ (కాళేశ్వరం) ప్రాజెక్ట్ కట్టిందంటూ ఎద్దేవా చేశారు. తీరా చూస్తే.. కొత్తగా కేవలం 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. గతంలో ఇలానే చేసిన నిజాం, ఖాసిం రిజ్వీ  ఏమయ్యారో వారు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నేడు వాళ్లు చేసిన అప్పుల వల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని.. అప్పే లేకపోతే అద్భుతాలు సృష్టించే వాళ్లమని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోవడానికి కారణం ఈ పాపాత్ములేనని సీఎం రేవంత్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.