‘దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా…’ అని తెలుగు రాష్ట్రాల ప్రజలు పాడుకుంటున్నారిప్పుడు. అవును మరి… పిల్లలందరికీ ఈ నెల 13 వరకు సెలవులు. దీంతో స్కూలు బ్యాగులను పక్కకు పడేసిన చిన్నారులు ఆటపాటల్లో తేలిపోతున్నారు. కొత్త బట్టల కొనుగోళ్లు, ఊళ్ల ప్రయాణాలు… వెరసి హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఒకటే రద్దీ. బతుకమ్మ సంబురాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలతో తెలంగాణ, ఏపీ మార్మోగి పోతున్నాయి. పలు రకాల వ్యాపార సంస్థలు… టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు వగైరా వస్తువులకు ‘దసరా బంపర్ బొనాంజా’ అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఆయా షాపుల ముందు వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఇక్కడే ‘మరో బొనాంజా’ జనాలకు పిచ్చెక్కిస్తోంది. అదే ధరల మంట. కూరగాయలు, ఉప్పులు, పప్పులు, నూనెల రేట్లు అదిరిపోతున్నాయి. పండక్కి ఏం కొందామన్నా… ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. వీటిని చూసి సామాన్యుడు ‘ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు…’ అని వాపోతున్నాడు. ఇక పండగ దగ్గరకొచ్చేసరికి ఆర్టీసీ, ప్రయివేటు ట్రావెల్స్ బాదే బాదుడికి బస్ టికెట్ రేట్లు ఆకాశానికెక్కటం ఖాయం. ఈ రకంగా దసరా పండుగ సంతోషంతోపాటు భారాలను కూడా మోసుకొస్తోందన్నమాట.
-బి.వి.యన్.పద్మరాజు