వస్తోంది ద(సారా)?

– పల్లెల్లో జోరుగా గుడుంబా తయారీ
– మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ

నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలో తాగునీరు, పాల ప్యాకేట్స్ దొరకని పల్లెలు ఉన్నాయంటే నమ్మండి,కానీ నాటు సారాయి దొరకని పల్లెలు లేవంటే అచ్చర్యానికి గురి కావాల్సిందే. మండలంలో పెద్దతూండ్ల,దుబ్బపేట, అడ్వాలపల్లి,శాత్రజ్ పల్లి,పాత రుద్రారం,చీపురుపల్లి,పివినగర్,తాడిచెర్ల,రావులపల్లి, నాచారం,ఆన్ సాన్ పల్లి,ఎడ్లపల్లి గ్రామాల్లోని వాగులు,వంకలు,గుట్టలు, అటవీ ప్రాంతాలు,పొలాలు, చేలల్లో గుడుంబా నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో గుడుంబా తయారీ చేసుకొని విచ్చలవిడిగా పల్లెలకు తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారు.తెల్లవారుజామున పాలు ప్యాకేట్స్ విక్రయించే చిరు వ్యాపారులు కాస్త ఆలస్యంగా రావచ్చు, కానీ నాటుసారాయి విక్రయించే అక్రమ వ్యాపారులు మాత్రం వేకువజామునే గుడుంబా ప్యాకేట్స్ ద్విచక్రవాహనాలపై ఇంటింటా చేరవేయడం పరిపాటిగా మారింది.
తూతుమంత్రంగా దాడులు…
గుడుంబా తయారిని అరికట్టడానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ తూతుమంత్రంగా దాడులు చేయడంతో గుడుంబా అరికట్టలేకపోతున్నారు.అధికారులు దాడులు చేసేముందు విక్రయదారులు సమాచారం ఇవ్వడంతో వారు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లుగా,విక్రయదారులే బహిరంగంగా చేర్పడం గమార్హం.నిర్వాహకులు ఆబ్కారీ అధికారులకు నెలనెల మామూళ్లు సమర్పించడంతో మండలంలో గుడుంబా విచ్చలవిడిగా నడుస్తోందనే అపవాదు ఉంది.
దసారా వస్తోంది…
మరో వారం రోజుల్లో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో నాటుసారను భారీగా పట్టణాలకు తరలించడానికి గుడుంబా తయారీ దారులు ఇప్పటికే ఆడ్వాన్స్ గా వేలాది లీటర్లలో నల్లబెల్లం,పటిక పానకం పులియ వేశారు.పల్లెల్లో సాధారణ రోజుల కంటే గిరాకీ ఎక్కువగా ఉండటంతో ముందస్తుగా జోరుగా గుడుంబా తయారు చేస్తున్నారు.బెల్లం దొరకని ప్రాంతాల్లో చక్కరతో తయారు చేస్తున్నారు.
నల్లబెల్లం, పటిక దిగుమతి..
గుడుంబా తయారీకి వినియోగించే నల్లబెల్లం,పటికను కామారెడ్డి,ఛత్తీస్ గడ్ ప్రాంతాల నుంచి భారీగా దిగుమతి చేసుకొని పెద్దతూoడ్ల,తాడిచెర్ల,కొయ్యుర్,రుద్రారం గ్రామాల్లో కొందరు కిరాణ వ్యాపారులు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెల్లం దొరకని ప్రాంతాల్లో చక్కెరతో తయారు చేస్తున్నారు.దసరా నేపథ్యంలో భారీగా బెల్లం,పటిక దుకాణాల్లో రహస్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.