అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ  పనులను పూర్తి చేయాలి: డివైఎఫ్ఐ

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 16వ వార్డులో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇంచార్జ్ మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోని అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన అర్బన్ కాలనీ సమస్యలకు నిలయంగా మారి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రపు పనులు చేసి ఎన్నికల కోసం వీధిలైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించి ఎన్నికల కోడ్ రాగానే పనులను మధ్యలో వదిలేసి పెండింగ్లో పెట్టడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు, సంబంధిత మున్సిపల్ కౌన్సిలర్లు కమిషన్లు తీసుకొని పనులను పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయడం జరిగిందన్నారు. డ్రైనేజీ నీళ్లు సక్రమంగా వెళ్ళక కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు 16వ వార్డులోని పెండింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి కాలనీని అభివృద్ధిలో ముందుకు నడపాలని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి సాజిద్, షేక్ రియాజ్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఎండి నేహాల్, షాహిద్, మసూద్  పాల్గొన్నారు.