దక్కన్ జాతి గొర్రెలపై పరిశోధన చేసి, ఆ జాతి అంతరించిపోకుండా పరిరక్షిం చాలన్న దూర దృష్టితోనే 1954లోనే రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దగ్గరలోని బండమీదిపల్లిలో 353 ఎకరాల భూమిని కేటాయించి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దక్కన్ జాతి గొర్రెలకు ప్రఖ్యాతి. తెలంగాణలోని వివిధ జిల్లాలో ఈ గొర్రెల జాతి ఉన్నప్పటికీ, సంఖ్యరిత్యా మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ. అదేవిధంగా వివిధ వ్యాధులకు సకాలంలో వైద్యమందక, రోగనిరోధక టీకాలు వేయక ప్రతి ఏడాది వేలాది గొర్రెలు చనిపోయేవి. ఇలా జరిగినప్పుడు ఈ జీవాలే జీవనాధారంగా ఉన్న గొల్ల, కురుమ కుటుంబాలు జీవనాధారం కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌లో సరైన మేత దొరకనందున తెలంగాణ, ఆంధ్రా ప్రాంతంలో వివిధ జిల్లాలకు వేలాదిమంది జీవాలను తీసుకొని వలస వెళ్లేవారు. నేటికీ వేలాదిమంది వలస జీవనం సాగిస్తున్నారు.
దక్కన్ జాతి గొర్రె నుండి తీసే ఉన్నీ, కంబళ్లు, గొంగళ్లు నేసి అమ్మేవారు. గొంగళ్లు వర్షానికి, చలికి రక్షణ కవచంగా ఉపయోగపడేవి. ఒకప్పుడు దేశ రక్షణ చేసే సైనికులు, పోలీసులు డిపార్ట్మెంట్‌కు ఈ గొంగళ్ళు సరఫరా చేసేవారు. ఉన్ని నుండి దారం తీసి కంబళ్ళు, గొంగళ్ళు నేసేది ఒక ”కళ”. గొర్రెల మంద ద్వారా వచ్చే పేడ (పెంట) భూసారానికి ఉపయోగపడేది. అందుకే రాత్రి గొర్రెల మందలను పొలాలలో ఆపే వారు. రాత్రి పొలాల్లో మంద నివాసం ఉండే ఛోటా దొంగల బెడద కూడా కాపర్లు ఎదుర్కొనేవారు. సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే సందర్భంగా జీవాలు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నాయి. మహబూబ్‌నగర్ కంబళ్ళు దేశంలోనే ప్రసిద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో కురుమలు వేలాదిమంది స్త్రీ, పురుషులు నేత పని ప్రధాన వృత్తిగా ఉండేది. ఈ ఉత్పత్తి వారాంతపు సంతలలో, జాతరలలో అమ్ముకొని జీవనం చేసేవారు. క్రమంగా యాంత్రీకరణ వల్ల ఈ వత్తి దెబ్బతిన్నది. ఇక్కడ సేకరించే ఉన్ని వివిధ రాష్ట్రాల వ్యాపారస్తులు యంత్రాలపై బ్లాంకెట్లు తయారు చేయించి సైన్యానికి, పోలీసు వారికి అందిస్తున్నారు. ఈ ఉన్నికి ప్రధాన వనరుగా ఉన్న దక్కన్ జాతి గొర్రెలు నేడు అంతరించే దశకు వచ్చాయి.
దక్కన్ జాతి కన్నా నెల్లూరు జాతి గొర్రెలు వేగంగా పెరుగుతాయి. ఎక్కువ మాంసాన్ని ఇస్తాయి. నల్ల జాతి గొర్రె (దక్కన్ గొర్రె) 65 నుండి 67 సెంటీమీటర్లు ఆడ గొర్రె, 62 నుంచి 65 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. ఈ గొర్రె ఏడాది వయసుకు 23 నుండి 25 కేజీల బరువు పెరుగుతుంది. రెండేళ్లలో గరిష్టంగా 35 నుండి 40 కిలోలు తూగుతుంది. ఇది మాంసం, ఎరువులు, ఉన్ని ఉత్పత్తికి ప్రసిద్ధి. ప్రస్తుతం ఎటు చూసినా నెల్లూరు జాతి గొర్రెలే మనకు కనిపిస్తున్నాయి. దక్కన్‌జాతి గొర్రె, నెల్లూరు గొర్రె మాంసం రుచిలో తేడా ఉంటుంది. ఈ దక్కన్ జాతి గొర్రెలు, అచ్చంపేట (నల్లమల) మేకలు అంతరించిపోకుండా వాటిని సం రక్షించాలన్న ఉద్దేశంతో, వివిధ జీవజాతుల అభివృద్ధికి ప్రభుత్వం పరిశోధనా కేంద్రాన్ని బండమీదిపల్లిలో ఏర్పాటు చేసింది.
పరిశోధనా కేంద్రంపై ప్రభుత్వం తగు దృష్టిపెట్టక, నిధులు కేటాయించక చిన్నచూపు చూడటంతో పాటు ఈ కేంద్రానికి చెందిన భూమి వివిధ సంస్థల పేరిట కేటాయిస్తూ వచ్చింది.షెడ్యూల్డ్ కులాలకు వ్యవసాయ భూములు పంచడానికి 30.16 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్, పాల ఉత్పత్తి కేంద్రానికి 9.04 ఎకరాలు, ద్రవ నత్రజని ప్లాంటుకు 2.20 ఎకరాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖకు పదెకరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోళ్ల మాంసం కార్పొరేషన్‌కు 2-11 ఎకరాలు, తెలుగుబాల మహిళా ప్రాంగణానికి 26 ఎకరాలు, పీజీ కళాశాలకు 26.29 ఎకరాలు, పీడి ద్వారా 17 ఎకరాలు, వెటర్నరీ హాస్పిటల్ 0.81 ఎకరాలు, బండమీదిపల్లి శ్మశానవాటిక కోసం 1.10 ఎకరాలు, వడ్డెర బస్తీ లేబర్ కాలనీ కోసం 2.91 ఎకరాలు, పాలమూరు యూని వర్సిటీలకు 171.50 ఎకరాలు కేటాయించింది. మిగిలిన 36.23 ఎకరాల నుండి జిల్లా కోర్టు భవనాలకు పదెకరాలు ఇచ్చింది. అదేవిధంగా జాతీయ రహదారి 167 ఇదే ఆవరణ నుండి వెళ్లడం రెండున్నర ఎకరాలు రోడ్డు నిర్మాణమవుతున్నది. దీని వల్ల అదనంగా రెండున్నర ఎకరాలు ఉపయోగం లేకుండా పోతున్నది. ఇలా భూ కేటాయింపు వలన పరిశోధనా కేంద్రం ఉనికికే ముప్పు ఏర్పడింది. భూమి ఇతర సంస్థలకు పంపిణీ చేసి అభివృద్ధికి ఉపయోగించడం మంచి విషయమే. కానీ, దక్కన్ జాతి గొర్రెల పరిశోధనా కేంద్రాన్ని నిర్వీర్యం చేయడం సరికాదు.
కేంద్ర ప్రభుత్వం రూ.3.35 కోట్ల నిధులతో కొత్త ప్రాజెక్టును ఈ పరిశోధన కేంద్రానికి కేటాయించింది. ప్రస్తుత పాలిటెక్నిక్‌తో పాటు వెటర్నరీ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు కూడా తమ పరిశోధనల కోసం ఈ సెంటర్‌కు వస్తుంటారు. గతంలో కోళ్లు, ఆవులు, గేదెలపై కూడా పరిశోధనలు జరిగేవి. ఈ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసుకోవడం వల్ల అనేక రకాల జీవజాతులతో పాటు అంతరిస్తున్న పక్షులపై కూడా పరిశోధనలు చేయవచ్చు. తగిన భూమి, నిధులు, సౌకర్యాలు కల్పిస్తే పెరుగుతున్న జనాభాకు సరిపడు మాంసాన్ని అందించే జాతులను కూడా పెంపొందించే పరిశోధనలు చేసే అవకాశం ఉంది. గనుక ఈ కేంద్రం ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా గుర్తించాలి.
ఈ పరిశోధనా కేంద్రంలో అంతరించిపోతున్న దక్కన్ జాతి గొర్రెలు 250, నల్లమల్ల అచ్చంపేట మేకలు 150 వరకు ఉన్నవి. వీటికి సరైన మేత ఉత్పత్తి చేయుటకు అవసరమగు భూమి కూడా లేకుండా పోతున్నది. ప్రస్తుతం ఈ జీవాలు ఉండే షెడ్స్‌ను కూడా తొలగిస్తున్నారు. దీంతో కేంద్రం దిక్కులేని అనాధగా మారిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఈ పరిశోధనా కేంద్రానికి అవసరమగు 350 ఎకరాల భూమి కేటాయించి, కేంద్రాన్ని రక్షించుకోవాలని గొర్రెల, మేకల పెంపక దారుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు మెమోరండాలు ఇచ్చినా వారి నుండి సరైన స్పందన లేదు. ప్రస్తుతం దక్కన్‌జాతి గొర్రెలు అంతరించే దశకు చేరుకున్న పరిస్థితుల్లో వాటిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పటికైనా జిల్లా కేంద్రంలో ఉన్న ఈ పరిశోధనా కేంద్రానికి భూమి కేటాయించి, పరిశోధనా కేంద్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– కిల్లె గోపాల్, 9490098760