డైనమిక్‌ లిటరరీ కమ్యూనిటీలు నేటి అవసరం

The Big Book of Odia Literatureμ‘ఆధిపత్యం (Dominance)’ మీద ‘గెలుపు (Victory)’ అనుకున్నంత సులువేం కాదు. ఎందుకంటే ఆధిపత్యానికి అండగా రాజ్యాలు ఉంటాయి. పెట్టుబడి, పలుకుబడి దానికి తోబుట్టువులు, అవినీతి అక్రమార్జన బంధువులు. ఆధిపత్యం ఎన్ని విధాలుగా మానవాళిని ఏలుతూ వచ్చిందో, వంచిస్తూ ఉందో తెలియాలంటే గతంలోకి వెళ్లాలి. గతం అంటే ఇవాళ్టి నుండి వెనక్కి దశాబ్దాలు, శతాబ్దాలు వెళ్లాలి.
వర్ణాధిపత్యం ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. వర్ణ వ్యతిరేక ఉద్యమాలు రాజుకోగానే ఆధిపత్యశక్తులు ఆయుధాలతో ముందుకొచ్చాయి. బుద్ధుణ్ణి ధ్యానిస్తూ, గాంధీజీని అనుసరిస్తూ ప్రపంచ ప్రజలు శాంతి, అహింసలతో చుట్టుముట్టగానే ఆధిపత్యశక్తులు తమ రూపాన్ని అత్యంత చాకచక్యంగా మార్చుకొని ఆర్థిక రంగాన్ని చెప్పుచేతుల్లోకి తీసుకున్నాయి. ఆర్థికాధిపత్యం ఇప్పుడు శ్రుతిమించి వికతంగా కోర విచ్చింది. అయితే, ప్రపంచీకరణ ఎంత దుర్మార్గమైందైనా దానికో సుగుణం ఉంది. నాలెడ్జిని, నైపుణ్యాలను వ్యాపారార్థమే కావొచ్చు ఎంచక్కా తలకెత్తుకుంటుంది. కులం, మతం, ప్రాంతం వీటన్నిటికీ అతీతంగా సరుకుగల మెదళ్లను సంతలో ఎంత మొత్తానికైనా కొనుగోలు చేస్తుంది. అట్లా ఆర్థికంగా బలహీన దేశాలు తమ మేధాశక్తితో నిలదొక్కుకుంటున్నాయని అనుకుంటుండగానే సాంస్కతిక ఆధిపత్యంతో ఆధిపత్య శక్తులు మోహరించాయి. అధికార, ఆర్థిక, ఆయుధ స్వామ్యాల ముప్పేట దాడికి ఎదురు నిలవడానికి చేష్టలుడిగి బలహీన దేశాల సాంస్కతిక వారసత్వం ప్రమాదంలో పడింది. అందుకనే వర్తమానాన్ని సామాజిక వేత్తలు ‘సాంస్కతిక వారసత్వం ప్రమాదంలో పడిన యుగం’ గా అభివర్ణించారు. సూటిగా చెప్పాలంటే మనం సాంస్కతిక వారసత్వం ప్రమాదంలో పడిన యుగంలో జీవిస్తున్నాం. మరిప్పుడు దారీతెన్నూ ఏదీ లేదా అంటే, ఎందుకు లేదు? ఉంది. ఒక చేవగలిగిన మార్గం ఉంది, ఒక సారభూతమైన ఉపకరణం ఉంది. ఏమిటా చేవగలిగిన మార్గం, సారభూతమైన ఉపకరణం అంటే… మన సాహిత్య సంస్థలు, సాంస్కతిక సంస్థలు ప్రోదిచేసే చైతన్యం, చాటే పరిమళాలు.
ఇటీవల ఒరిస్సానుండి ` అనే ఆంగ్ల గ్రంథం వచ్చింది. దీని సంపాదకుడు మనూదాస్‌. ఈ పుస్తకంపై అశుతోష్‌ కుమార్‌ ఠాకూర్‌ ుష్ట్రవ ఔఱతీవ మ్యాగజైన్‌ లో రివ్యూ చేస్తూ ”Any languages continue to thrive, with a dynamic literary community that includes poets, novelists, and scholars who carry  forward their legacy of their predecessorsμμ (The Wire- Preserving the past, Inspiring the future- Odisha Literary Treasure-31 August 2024) అంటాడు. ఈ వ్యాఖ్యలో మనకు డైనమిక్‌ లిటరరీ కమ్యూనిటీ అనే మాట స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సజనశీల, సమరశీల సాహిత్య సమాజాల అవసరం దేశానికి, ప్రపంచానికి ఉందని, సజనశీల సమరశీల సాహిత్య సమాజాలు మాత్రమే ప్రమాదం అంచున ఉన్న సాంస్కతిక వారసత్వాన్ని పరిరక్షించగలవని అశుతోష్‌ కుమార్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజమే, సరిహద్దులు ప్రమాదంలో పడితే సైన్యం యుద్ధం చేస్తుంది. మరి సమాజం ప్రమాదంలో పడితే కవిసైన్యం పోరాడుతుందనేది అశుతోష్‌ కుమార్‌ వ్యాఖ్యలోని అంతరార్థం. జీవిక కోసం పాటుపడే వత్తి ఏదైనా సాంద్రతర హదయాలు, సాహిత్య గంధం అంటిన వాళ్లు తమ భావజాల సన్నిహితులను కలుపుకొని సాహిత్య సంస్థలను ఏర్పాటు చేస్తుంటారు. అవి చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని పెద్ద నగరాల దాకా ఆయా పేర్లతో నిరాడంబరంగా ఉనికిలో ఉండటం మనం చూస్తున్నదే. ఇవి తమకు తోచిన రీతిన నెల నెలానో, త్రైమాసికంగానో, అర్థవార్షికంగానో లేదా వార్షికంగానో సభలు సమావేశాలు జరుపుతున్నదానికీ మనం సాక్షులం. ఇదిగో ఈ సాహిత్య సమాజాలు చేపట్టే కార్యక్రమాలే కొత్తతరాన్ని సజన రంగంలోకి తీసుకురాగలుగుతాయి. విరళంగానైనా ఆ పట్టణాలు, నగరాలు వేదికగా కవిత్వం, కథ, నవల, నాటకం ఇత్యాది ప్రక్రియలు ప్రజలతో సంభాషిస్తుంటాయి.
సంస్కతిని ప్రజల తాలూకు ఆచార వ్యవహారాలు, పద్ధతులు, చిహ్నాలు, నిబంధనలు, వేడుకలు, నమ్మకాలు పాటించే విశ్వాసాలుగానే పరిగణిస్తాం. ఇది సాధారణ అవగాహన. సంస్కతికి సంబంధించిన ప్రత్యేక అవగాహన కూడా మనకు ఉండాలి. అదేంటంటే, సంస్కతి ఎక్కడికక్కడ ఆయా ప్రజాశ్రేణుల గుర్తింపుకు, గౌరవానికి సంబంధించిన ఆలోచనలు ప్రవర్తన నమూనా. సంస్కతి ప్రజల జీవనాడి, గుండెకాయ. సంస్కతికి ప్రధానంగా ఆ జాతి ప్రజలు పాటించే విలువలే పునాది. అందుకనే టాగోర్‌ మహాశయుడు ”నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను ఎందుకంటే నేను భూభాగ విగ్రహారాధనను పెంపొందించుకోవడం వల్ల కాదు, నాకు ఈ మట్టిలో పుట్టే అవకాశం లభించినందున కాదు, కానీ ఈ దేశం తన గొప్ప కుమారుల ప్రకాశవంతమైన స్పహ నుండి వెలువడిన సజీవ పదాలైన సత్యం, జ్ఞానం, అనంతమయం తమ ప్రభచేత చారిత్రక గందరగోళ యుగాలలో మానవాళిని రక్షించినందున” (The cultural Heritage of India, Vol.1, Ramakrishna Mission, Calcutta, page xxi, 1937) అంటారు. మహనీయులు ఉద్భవించి మానవాళికి ప్రవచించిన జ్ఞాన మార్గం తను భారతీయుడను అనే తాదాత్మ్యానికి, పరవశానికి హేతువు అని రవీంద్రుడు ఎరుక పరిచాడు. ఇంతటి ఘనమైన సాంస్కతిక వారసత్వం ఇవాళ ప్రమాదం పడిన దరిమిలా పునఃదీప్తి(Recalescence) కోసం నిలబడాల్సినవి, కలబడాల్సినవి సాహిత్య సమాజాలే. అయితే, ఇక్కడో చిన్న మాట చెప్పాలి. సాహిత్య సమాజాలు అంటే దేశంలోని ప్రధాన భాషల్లోని పేరెన్నికగల సంస్థలే కాదు, చిన్న చిన్న భాషల్లోని మరీ ముఖ్యంగా ఆదివాసీసాహితీ బృందాలు కూడా. ఇందుకుThe Big Book of Odia Literature గ్రంథమే మంచి ఉదాహరణ. ఇందులో ఒరియాతో పాటు అక్కడి మారుమూల ప్రాంతాల నాలుగైదు గిరిజనభాషలు, వాటి సజనపుష్ఠి తొణికిసలాడుతుంది.
భాష అత్యుత్తమ రూపమైన సాహిత్యం సమాజానికి తనదైన బ్లూప్రింట్‌ను ఎప్పుడూ అందిస్తూనే వుంటుంది. ప్రాచీన నాగరికతల విశేషాలు మొదలుకొని ఆధునికమైన కాల్పనికత వరకు సమాజ వికాసాన్ని తాత్వికంగానూ, వైజ్ఞానికంగానూ ఆవహించి నలుదిక్కులకు సంచరిస్తుంది. మరీముఖ్యంగా సాహిత్యం ప్రపంచానికి అంతర్‌దృష్టిని ప్రసాదిస్తుంది. మిగతా కళాఖండాల కంటే, అందుబాటులో ఉన్న చరిత్ర కంటే ఉన్నతమైనది. సాహిత్యాన్ని మించి ప్రాపంచిక అనుభవాన్ని రికార్డు చేసే ప్రక్రియ మరొకటి లేదు. ఈ కింద పేర్కొన్న కవితను చూడండి. ఇది ఒడిస్సాలోని గిరిజన భాషల్లో ఒకటైన ‘ఖరియా’ కవిత. తండ్రీ కొడుకుల మధ్య నెలకొన్న దుఃఖపూరిత సందర్భాన్ని వివరించే ఖరియా కవి ఏం చెబుతున్నాడో చూడండి-
”నది అవతలి ఒడ్డు నుండి/ నాన్న నన్ను పిలుస్తున్నాడు/ నేను ఎలా దాటుతానో దేవునికి తెలుసు-/ నా ప్రియమైన తండ్రిని వినడానికి అడ్డుగా/ కోయెల్‌ అంచుల వరకు నిండి/ సంఖు నది పొంగి ప్రవహిస్తున్నది-/ వెన్నగర్ర విరిగిపోయింది/ నా పడవ మునిగిపోయింది-/ నేను నదిని ఎట్లా దాటగలను?/ నేను నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి?/ బతుకు కుదురును గురించిన/ నా తండ్రి మాటలు నేను ఎలా వినాలి?/ జాలరి అబ్బాయీ!/ నువ్వే నాకున్న ఒక్కాగానొక ఆశ-/ నన్ను నది దాటిస్తావో/ ప్రవాహం మధ్యలోనే ముంచేస్తావో!/ అంతా నీ దయ”
ఈ పంక్తులు The Big Book of Odia Literature’ సంకలనంలోని కవిత్వం లోతుకు, భావోద్వేగ తీవ్రతకు ప్రతిధ్వని. అంతేకాదు, ఇప్పుడు మనల్ని ముంచెత్తుతున్న సాంస్కతిక ఆధిపత్యం విషపుదాడిపై తిరగబడుతున్న మూలవాసీ, ఆదివాసీ గొంతుక ప్రతినిధి. చివరగా ఒకమాట… స్థాపించిన సాహితీ సంస్థనో, కూడిన రచయితల బందమో, ఏదైనా ఎవరైనా వెనకటివి రాస్తూ కాలాన్ని వెనుకకు నడిపించేదిగా ఉండకూడదు. రచయితలుగా తరచూ కలుస్తూ, తమ రచనలను వినిపించుకుంటూ, స్పందనలను అనుసరించి సరిచేసుకుంటూ, సద్యస్ఫురణతో కార్యశాలల్లో నిమగమవుతూ ఉండే క్రియాశీల భాగస్వామ్యం (Active participation) సమరశీల సాహిత్య సమాజానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. భిన్న సామాజిక నేపథ్యం కలిగిన సభ్యులు, వివిధ ప్రక్రియల్లో రాయగల సామర్థ్యం, సారవంతమైన దష్టికోణం, సమస్యను చిత్రిక పట్టగలిగిన నైపుణి, వైవిధ్య స్వరాల (Diversity of voices) రాణింపు రెండో లక్షణం. నూతన వాదాల ఆకళింపు, శైలీ నవ్యత, కొత్త గొంతుల చేరిక, స్థానీయ సంస్కతికి అండగా ప్రచారం, సరికొత్త ఆలోచనలకు సారథ్యం (Open to new ideas) మూడో లక్షణం. అన్యోన్యంగా ఒకరికొకరు ప్రోత్సాహం కల్పించుకుంటూ పరస్పరం రచయితలుగా, కవులుగా ఎదుగుతూ ఉండే సహదయత, సహకార స్ఫూర్తి (Collaborative spirit) నాల్గోగుణం. సజనాత్మక కార్యక్రమాలు, ప్రజలతో శ్రేణులవారీ అనుబంధం, ప్రతి సంఘర్షణలోనూ సమాజానికి సాహిత్యం దాపుంటుందన్న భరోసా (Community building initiatives) ఐదో లక్షణం. ఈ ఐదు లక్షణాలున్న సాహిత్య సంస్థలు మాత్రమే సమరశీల సాహిత్యాన్ని అందించగలవు. అశుతోష్‌ కుమార్‌ అన్నట్టు సమరశీల సాహిత్యమే ఇవాళ్టి సాంస్కతిక ఆధిపత్యాన్ని అడ్డుకోగలదు, నిలువరించగలదు. జోకుడు సంస్థలు, జోలపాడే కవిత్వం నిష్క్రయాళువులు.
– డా.బెల్లి యాదయ్య, 98483 92690