బీఆర్‌ఎస్‌ అవినీతిని వెలికి తీస్తాం..

– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి
– జనగామ బహిరంగ సభలో అమిత్‌ షా
నవతెలంగాణ-జనగామ
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. దాన్ని వెలికి తీస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత హమిత్‌షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రీస్టియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హమిత్‌సా ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓవైసీ జపం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను 2జీ, 3జీ, 4జీ పార్టీలుగా అభివర్ణించారు. ఓవైసీ మత్తులో పడి సెప్టెంబర్‌ 17న రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారన్నారు.
తాము అధికారంలోకి రాగానే జనగామ జిల్లాలో అవసరమైన పాలిటెక్నిక్‌ కాలేజ్‌తోపాటు బైరాంపల్లిలో వీరుల స్మారక స్మృతిని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకార్లను ఎదిరించి కొట్లాడిన వీర చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలన పూర్తిగా అవినీతిమయమైందన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, హైదరాబాద,్‌ మియాపూర్‌ భూములు, వివిధ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటన్నింటినీ త్వరలో వెలికి తీసి అవినీతిపరులను జైలుకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనగామ నియోజకవర్గ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి, స్టేషన్‌ఘన్పూర్‌ అభ్యర్థి గుండె విజయరామారావు, పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి రామ్‌మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, నాయకులు విద్యాసాగర్‌ రెడ్డి, ఉడుగుల రమేష్‌, చౌడ రమేష్‌, అశోక్‌, కెవిఎల్‌ఎన్‌ రెడ్డి పాల్గొన్నారు.