ప్రతి ఒక్క టీకా లబ్ధిదారులను ఆన్లైన్లో 7.1 వర్షన్లో నమోదు చేయాలి.. 

నవతెలంగాణ -డిచ్ పల్లి

ప్రతి ఒక్క టీకా లబ్ధిదారులను ఆన్లైన్లో 7.1 వర్షన్లో నమోదు చేసే విధంగా వైద్య ఆరోగ్య సిబ్బంది చుడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం అన్నారు. శనివారం డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ వైద్య ఆరోగ్య ఉప కేంద్రం, అమృతాపూర్ గ్రామంలోని ఉప కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అయన పరిశీలించారు. టీకాలు నిల్వ చేసే శీతలీకరణ పద్ధతులను వైద్య సిబ్బంది కి వివరించారు.టీకా మందులపై తేదీని, సమయాన్ని వేసిన విషయాన్ని గమనించి సిబ్బందిని అభినందించారు.ప్రతి ఒక్క టీకా లబ్ధిదారులను ఆన్లైన్లో 7.1 వర్షన్లో నమోదు చేసే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఆశా కార్యకర్తల డ్యూ లిస్టును అయన పరిశీలించారు. ప్రతి ఉప కేంద్రంలో జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరిగే రోజు కంటే ముందే డ్యూలిస్టును తయారు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి సరైన సమాచారం అందించాలని వైద్య సిబ్బంది కి సూచించారు. గ్రామంలోని గర్భిణీ స్త్రీలు, బాలింతల రిజిస్టర్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంట సిసి  పిల్లమారి మధుకర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్య విస్తరణ అధికారి యెనుగందుల శంకర్, ఆరోగ్య కార్యకర్త అనంత షీభారాణి, అంగన్వాడి టీచర్ రజిత, ఆశా కార్యకర్తలు రేణుక, ఇందిరా, రుక్సానా, సరిత, నిశాంతి, స్వప్న పాల్గొన్నారు.