ఒక‌రికొక‌రుగా…

each other...వేగవంతమైన ఈ పోటీ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. బీజీ బతుకులతో మన సంబంధాలను తేలికగా తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా దంపతుల మధ్య అన్యోన్యత కరువయ్యింది. ఉద్యోగాలూ, డబ్బు సంపాదన అంటూ కాలం వెళ్లతీస్తున్నారు. తమ కంటూ కొంత సమయం కేటాయించుకోవాలనే విషయమే మర్చిపోతున్నారు. అదిగుర్తు చేసేందుకే ప్రతి ఏడాది ఆగస్టు 18న ‘నేషనల్‌ కపిల్స్‌ డే’ జరుపుకుంటున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు ప్రాధాన్యం కూడా పెరిగిపోయింది. దంపతులు తమ గురించి తాము పట్టించుకునేందుకు ఈ రోజును చక్కగా ఉపయోగించుకుంటే జీవితాంతం ఒకరికొకరుగా జీవించవచ్చు అంటున్నారు నిపుణులు. దంపతుల మధ్య ప్రేమ పదిలంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

మీ బంధం ప్రాముఖ్యతను తెలుసుకొని దాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత, ప్రేమను వ్యక్తీకరించడానికి అవకాశాన్ని అందించండి. ఇద్దరూ కలిసి నాణ్యమైన సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చుకునేందుకు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. దీని కోసం కొత్త జ్ఞాపకాలు సృష్టించండి. మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి. మీ భాగస్వామితో మీ మనసులోని భావాలు పంచుకునేందుకు, మీలోని ప్రేమను తెలియజేసేందుకు, వారి పట్ల మీకున్న అభిప్రా యాన్ని, ప్రశంసలను వ్యక్తీకరించడానికి, మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ రోజును మంచి అవకాశంగా భావించండి.
నిజాయితీగా ఉండండి
దాంపత్య బంధంలో నిజాయితీకెంతో ప్రాముఖ్యత ఉంది. అలాగని ఎదుటి వారితో ‘సత్యమే మాట్లాడుతున్నా’ అంటే సరిపోదు. ప్రవర్తనలోనూ పారదర్శకత కనిపించాలి. చెప్పినట్టు పాటించి చూపించాలి. భాగస్వామి వల్ల ఇబ్బంది కలుగుతున్న వాటిని మనసులో దాచుకోకుండా సున్నితంగా చెప్పగలగాలి. అలాగే అవతలి వారి గురించి మీ ఆలోచనలను కూడా బహిరంగంగా చర్చించాలి. అప్పుడే ఆ లోపాలు ఎదుటి వారికి తెలిసే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారికి మీ వల్ల కలిగే ఇబ్బందినీ అడిగి తెలుసుకోవాలి. ఇలా ఒకరితో మరొకరు వాస్తవికంగా ఉంటేనే వారి మధ్య నిజమైన ప్రేమబంధం ముడిపడుతుంది.
సమయం ఇవ్వండి
కాపురంలో కలతలు సహజమే. అలాగని రోజూ గొడవపడుతుంటే ఎవరూ సంతోషంగా ఉండలేరు. కలతలకు కారణం దాపరికాలు, నిజాయితీ లేకపోవడం, అబద్దాలు… వంటివే కాదు. సరైన సమయం ఇవ్వకపోవడం అని కూడా గుర్తించండి. అది మరిన్ని సమస్యలకు దారితీసి మీ బంధాన్ని చీల్చేయొచ్చు. దీన్ని పోగట్టుకోవాలంటే భాగస్వామితో మునసువిప్పి మాట్లాడడమే పరిష్కారం. అప్పటికీ అది సాధ్యం కాకపోతే నిపుణుల సాయం తీసుకోండి. కలిసి కౌన్సెలిగ్‌కి వెళ్లండి.
సానుకూలాంశాలే…
ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసిపోయాక లోపాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి పరిస్థితి మీ ఇద్దరి మధ్య రాకూడదంటే ఏకాంతంగా కలిసినప్పుడు సానుకూలాంశాలే మాట్లాడుకోండి. అలా చెప్పలేకపోతున్నారా? అయితే రెండు కార్టన్‌ బాక్సులు తీసుకుని ఒకదానికి గులాబీ, మరోదానికి బ్లూ కలర్‌ పేపర్స్‌ని అతికించి ఓ మూలన పెట్టండి. వారానికో లేఖ అయినా అందులో వేయండి. ఎప్పుడైనా వాదోపవాదాలు జరిగినా మీ అభిప్రాయాలను ఈ లేఖల్లో చెప్పొచ్చు. ఒకవేళ వారికి మీపై అపోహలు, అనుమానాలు ఉన్నా మీరు చూపించే ప్రేమతో సర్దుకుపోగలరు. తామేమైనా తప్పుగా ఆలోచించినా మార్చుకుంటారు.
ఒత్తిడి తగ్గించుకోండి
భార్యాభర్తల మధ్య విభేదాలకు పని ఒత్తిడీ ఓ కారణమంటారు నిపుణులు. ఆఫీసు పనులూ, ఫోన్లతోనే గడిపేస్తూ తమకి సమయం కేటాయించడం లేదన్నదే ఎక్కువమంది మహిళల ఫిర్యాదట. ఈ పరిస్థితి మీకూ ఎదురైతే, ఆ తరహా జీవినశైలిని ఎలా మర్చుకోవచ్చో, అవతలివారు సమయం ఆదా అయ్యేందుకు ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించండి. వీలైతే రోజూ ఉదయపు నడకకు కలిసి వెళ్లండి. బాల్కనీలో కూర్చుని టీ తాగండి. ఈ అలవాటు మీలో అభద్రతా భావాన్నే కాదు, అవతలివారిలో ఒత్తిడినీ తగ్గిస్తుంది. ఎంత వీలు చిక్కకపోయినా, నెలకోసారైనా ఇద్దరూ కలిసి దగ్గర్లోని పార్కుకో, మీకిష్టమైన షాపింగ్‌కో వెళ్లిరండి. తేలికపడతారు.
కలిసి ప్రయాణించండి
ప్రతి ఏడు నెలలకు దంపతులిద్దరూ తమ ఉద్యోగం లేదా కుటుంబ బాధ్యతల నుంచి సెలవు తీసుకోవాలి. ఈ ‘రొమాంటిక్‌ లీవ్స్‌’ను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏదైనా విహారయాత్ర ప్లాన్‌ చేసుకోవాలి. బాధ్యతలతో రోజంతా భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉంటారు. సాయంకాలానికి అలసిపోతారు. ఈ జీవనశైలి వైవాహిక బంధాన్ని యాంత్రికంగా మారుస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే దంపతులిద్దరూ ఇలా ఒంటరిగా మనసుకు నచ్చిన ప్రాంతానికి వెళ్లాలి. ప్రకృతిలో గడిపి, దైనందిక జీవితంలోని ఒత్తిడిని దూరం చేసుకోవాలి. దీంతో శరీరం, మనసు తిరిగి ఉత్సాహంగా మారతాయి. మరింత మీ బంధం బరింత దృఢంగా మారతుంది.