సినారే ప్రతి పాటా సాహిత్య పరంగా ప్రత్యేకత

– వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు
నవతెలంగాణ-కల్చరల్‌
మూడు వేల పైగా సినీ పాటలు రాసినా సినారే ప్రతి గీతం సాహిత్య పరంగా ప్రత్యేకత ఉన్నవని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు. శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్‌ వంశీ కల్చరల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రఖ్యాత కవి డాక్టర్‌ సి నారాయణ రెడ్డి తొలి సినీ గీతం రచించి 65 ఏండ్లయిన సందర్భంగా ప్రముఖ గాయకులు మిత్రా వై.ఏస్‌.రామకష్ణ శశికళ గీతాంజలిలు నలభై పాటలను మధురంగా అలపించి పాటల పట్టాభిషేకం చేశారు. సినారే రచించిన తొలి పాట నన్ను దోచుకుందవాటేతో అరభించి ఎవరికీ తలవంచకు, చిత్రం భళారే విచిత్రం వంటి పాటలను వారు గానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో నిర్వహకులు వంశీ రామరాజు, తిరుమల గ్రూప్‌ చైర్మెన్‌ నంగ నూరి చంద్ర శేఖర్‌ పాల్గొని మాట్లాడుతూ.. సినారే పాటలు నిత్య నూతనం అన్నారు. చంద్ర శేఖర్‌ గాయనీ గాయకులను అయోధ్య నుంచి తెప్పించిన శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. డాక్టర్‌ తెన్నేటి సుధ, సుంకరపల్లి శైలజ కార్యక్రమం పర్యవేక్షణ చేయగా సినారే కుమార్తెలు గంగ, యమున, కావేరి, కష్ణవేణి వారి భర్తలతో పాల్గొన్నారు. ప్రముఖ నటి శారద చెన్నై నుంచి సందేశం పంపుతూ సినారే తన సినిమాలకు సాహిత్య సంగీత పరమైన హిట్‌ పాటలు రాశారని గుర్తు చేశారు.