నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభ కోణం కేసులో టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ జరుగుతుందని ధర్మాసనం వెల్లడించింది. మంగళవారం కూడా ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఇరుపక్షాల న్యాయవాదులు హౌరాహౌరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించగా, సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రధానంగా 17 ఏ చుట్టూనే వాదనలు జరిగాయి. తొలుత గంట పాటు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అనంతరం న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ప్రజా ధనం దుర్వినియోగం అయిందని, చంద్రబాబు చర్యలతో ఏపీకి నష్టం జరిగిందని వాదించారు. సుదీర్ఘంగా వాదనలు జరగడంతో జోక్యం చేసుకున్న ధర్మాసనం వాదనలు వినిపించేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని అడగ్గా, మరో గంట పడుతుందని ముకుల్ రోహత్గీ అన్నారు. అయితే మిగతా వాదనలు శుక్రవారం వింటామని ధర్మాసనం అనగా, అందుకు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుని, ఈ రోజే వాదనలు పూర్తి చేయాలని అన్నారు. చాలా కేసులు ఉన్నాయని, ఈ రోజే వినేందుకు సమయం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే శుక్రవారం వాదనలు వినిపిస్తామని ముకుల్ రోహత్గీ అనగా, చంద్రబాబు తరపు న్యాయ వాది సిద్దార్థ లూథ్రా గురువారానికి వాయిదా వేయాలని కోరారు. ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుని శుక్రవారం లేదా సోమవారమని పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.