ముందుగానే డచ్‌ జట్టు!

Early Dutch team!– బెంగళూర్‌లో వార్మప్‌ మ్యాచ్‌లకు ప్లాన్‌
బెంగళూర్‌ : 2023 ఐసీసీ మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌ క్రికెట్‌ జట్టు.. భారత్‌కు షెడ్యూల్‌కు ముందుగానే రానుంది. సెప్టెంబర్‌ రెండో వారంలోనే భారత్‌లో అడుగుపెట్టనున్న డచ్‌ జట్టు.. బెంగళూర్‌లో పలు ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడనుంది. ‘ అవును, మా జట్టు భారత్‌కు షెడ్యూల్‌కు ముందుగానే రానుంది. ప్రపంచకప్‌ వార్మప్‌ గేమ్‌లకు ముందు బెంగళూర్‌లో కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడాలని అనుకుంటున్నాం. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అనంతరం మా జట్టుకు ఎటువంటి గేమ్‌ ప్రాక్టీస్‌ లేదు. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ముందు కాస్త ప్రాక్టీస్‌ అవసరం’ అని డచ్‌ క్రికెట్‌ సంఘం అధికారి ఒకరు తెలిపారు. బెంగళూర్‌లో ఎవరితో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేది ఇంకా ఖరారు కాలేదు. బెంగళూర్‌లో ప్రాక్టీస్‌ మ్యాచుల అనంతరం నెదర్లాండ్స్‌ నేరుగా హైదరాబాద్‌ లేదా తిరువనంతపురంకు చేరుకునే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌ తొలి మ్యాచులు హైదరాబాద్‌లోనే ఆడాల్సి ఉంది. అక్టోబర్‌ 9న పాకిస్థాన్‌తో, అక్టోబర్‌ 9న న్యూజిలాండ్‌తో డచ్‌ జట్టు తలపడనుంది. ఓవరాల్‌గా వన్డే వరల్డ్‌కప్‌లో ఐదోసారి పోటీపడుతున్న నెదర్లాండ్స్‌.. 2011 తర్వాత తొలిసారి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది.