– నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్
వరదల వల్ల వివిధ తరహా నష్టాల నియంత్రణకు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 39కి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరదలు వచ్చాక తీసుకునే సహాయక చర్యల కంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సెక్షన్ 39లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని విపత్తుల నిర్వహణ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. భారీ వర్షాలు, వరదల సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల్లంతైన గట్టం మహాలక్ష్మి కోసం గాలించి ఆచూకీ గుర్తించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మరణించినట్టు నిర్ధారణ అయితే ఆమె కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జులై, ఆగస్టులో వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుధాకర్ వేసిన అనుబంధ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. వరదల్లో 47 మంది మరణించారనీ, వారిలో 24 మందికి పరిహారం చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హరేంద్ర ప్రసాద్ వివరాలు సమర్పించారు. వరదలప్పుడు 192 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి 20,387 మందికి తాత్కాలిక నివాసం, ఆవాసం, వైద్యసేవలు అందించినట్టు వివరించారు. వరదలు తగ్గాక ఆ కేంద్రాలను ఎత్తేశామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల్లంతైన మహాలక్ష్మి ఆచూకీ మాత్రం లభించలేదన్నారు. వరదలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. విచారణ డిసెంబర్ 18కి వాయిదా పడింది.
ఎంపీ అవినాష్ తండ్రికి బెయిల్ నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, అదే కేసులో మరో నిందితుడు గజ్జల ఉదయకుమార్ రెడ్డిలకు హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ వేసిన వేర్వేరు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ లక్ష్మణ్ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఏపీ సీఎం జగన్‌కు భాస్కర్‌రెడ్డి సన్నిహిత బంధువు. ఇదే కేసులో ఎనిమిదో నిందితుడైన ఎంపీ అవినాష్‌రెడ్డికి తండ్రి. భాస్కర్‌రెడ్డి, ఉదరులపై తీవ్ర అభియోగాలున్నాయి. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో వారిద్దరి ప్రమేయంపై ఆధారాలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇతరులను బెదిరించి సాక్షులపై ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. సీఐ శంకరయ్య, గంగిరెడ్డి వాంగ్మూలాలు ఇస్తామంటూ వెనక్కి తగ్గారు. ఇద్దరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు కోరవచ్చనడం సరికాదు. దస్తగిరి, సాక్షుల వాంగ్మూలాల విశ్వసనీయతను ట్రయల్ కోర్ట్ పరిశీలిస్తుంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోలేం. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. దస్తగిరి మినహా నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. కేసు డైరీ, అన్ని అంశాలనూ పరిశీలించిన అనంతరం పిటిషన్లను కొట్టివేస్తున్నాం’అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల కేసులో అడ్వకేట్ కమిషన్
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికపై దాఖలైన ఎన్నికల పిటిషన్ కేసులో సాక్షుల వాంగ్మూలాల నమోదుకు హైకోర్టు అడ్వకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సాక్షులకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 11 నాటికి సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఎవరికీ వాయిదాలు ఇవ్వరాదని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల ఆరు, ఎనిమిది, 11 తేదీల్లో సాక్షులుగా ఉన్న అధికారుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసి 12న జరిగే విచారణ నాటికి ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించారు.
నోటీసులు జారీ
మెదక్ పోలీస్ స్టేషన్‌లో ఖాదీర్ ఖాన్ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. దొంగతనం కేసులో తన భర్త ఖాన్‌ను పోలీసులు కొట్టడం వల్లే మరణించాడంటూ అతని సతీమణి సిద్ధేశ్వరి పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరధే ఆధ్వరంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. హోం కార్యదర్శి, మెదక్ ఎస్పీ, మెదక్ ఎస్‌హెచ్‌ఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే ఘటనపై విచారణలో ఉన్న పిల్‌తో కలిపి ఈ పిటిషన్‌ను విచారిస్తామంది. సిట్ ఏర్పాటు చేయాలనీ, పిటిషనర్‌కు ప్రభుత్వం రూ.50 లక్షలు ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలని ఆమె న్యాయవాది వాదించారు.