టీఎన్వీ రమణ స్ఫూర్తితో భూఉద్యమాలు

Earth Movements inspired by TNV Ramana– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య
– చెన్నూర్‌లో టీఎన్వీ రమణ స్మారక విజ్ఞాన కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-చెన్నూర్‌
పార్టీ సీనియర్‌ నాయకులు టీఎన్వీ రమణ పోరాట స్ఫూర్తితో భూ ఉద్యమాలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జరుగుతున్న పార్టీ రాజకీయ శిక్షణా తరగతుల్లో భాగంగా ఎన్వీ రమణ స్మారక విజ్ఞాన కేంద్రాన్ని సోమయ్య ప్రారంభించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బోడేంకి చందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సోమయ్య మాట్లాడారు. బావురావుపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 8లో ప్రభుత్వ భూములను అక్రమార్కులు, భూకబ్జాదారుల నుంచి పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ.5లక్షలతో పేదలు వేసుకున్న గుడిసెల స్థానంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, రోడ్డు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏండ్లు గడిచినా ప్రజలకు కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్టాల్లో మహిళలకు భద్రత లేదన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న మరణహోమాన్ని ఆపాలని, ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలాల పోరాట కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్‌, కనికరపు అశోక్‌, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్‌ కుమార్‌, చెన్నూరు పట్టణ కార్యదర్శి ఎండీ అవిజ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.