బీజేపీలో భూకంపం

– ఏకమవుతున్న బీఆర్‌ఎస్‌ వ్యతిరేకులు
– కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
– కాకరేపుతున్న ఆయన కామెంట్స్‌
– మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ చేరికను తిరస్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి
– తన నియోజకవర్గంలోనే పోటీ అభ్యర్థిని తెచ్చారని ఈటలపై ఫైర్‌ ొ అదే రోజు మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు కొడుక్కి పార్టీ తీర్ధం
– ఆయనకే వేములవాడ టిక్కెట్‌ అని ప్రచారం
– తుల ఉమకు చుక్కెదురు
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
బీజేపీలో రాజకీయ భూకంపం ప్రారంభమైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో పార్టీ పునాదుల నుంచి ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరణతో బీజేపీలో ఉన్న నేతలకు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ముఖ్యంగా పార్టీలో ఈటల రాజేందర్‌ పెత్తనాన్ని కొందరు నేతలు ఆక్షేపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈటల కూడా అక్కడ మెసలలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బీఆర్‌ఎస్‌ కమ్యూనిస్టులతో కటీఫ్‌ చెప్పాక, బీజేపీ-బీఆర్‌ఎస్‌ బంధం ప్రజలకు అర్ధమైపోయిందనీ, తాము కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరితే, ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న రహస్య అవగాహన బట్టబయలైందని మొత్తుకుంటున్నారు. దీనితో బీజేపీలో ఉంటే కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడలేమనే నిశ్చితాభిప్రాయానికి వచ్చిన కొందరు బీజేపీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిసింది. బీజేపీలో చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి భారీ ఎత్తున చీలికలు తెచ్చి, నేతల్ని బీజేపీలోకి తెస్తారని ఆశిస్తే, అలాంటిదేం అక్కడ జరక్కపోవడంతో ఈటల ప్రాబల్యం, ప్రాధాన్యత తగ్గినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాలతో పొసక్కే ఈటల కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సూటిగానే చెప్పేశారు. తనతో పాటు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జీ వివేక్‌, రవీంద్రనాయక్‌ వంటి నేతలమంతా కలిసి కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని స్పష్టం చేశారు. పార్టీలో చేరతామని చెప్పిన కొందరు మాట తప్పారనీ, తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరుతున్నాననీ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను బీజేపీలో ఉంటే ఎదుర్కోలేమనీ, ఉద్దేశ్యపూర్వకంగానే బీఆర్‌ఎస్‌కు బీజేపీ లోపాయికారి సహకారాన్ని అందిస్తున్నదనీ ఆరోపించారు. మరోవైపు ఈటల రాజేందర్‌ వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీ కృష్ణయాదవ్‌ను
బీజేపీలో భూకంపం బీజేపీలోకి తెచ్చేందుకు చేరికల కమిటీ చైర్మెన్‌ హౌదాలో ఈటల రాజేందర్‌ పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఆయన పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. కృష్ణయాదవ్‌ కూడా తాను ఆగస్టు 30న బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. దానిలో భాగంగా హైదరాబాద్‌ సిటీలో తనతో పాటు ఈటల రాజేందర్‌, మోడీ, అమిత్‌షా, నడ్డాల ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 30వ తేదీ నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌హాల్‌లో తన మద్దతుదారులు, కార్యకర్తలు, సన్నిహితులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీర్యాలీకి ఏర్పాట్లు చేశారు. పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాక, అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి అడ్డుపడినట్టు సమాచారం. తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణయాదవ్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ఈటలతో వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది. దీనితో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, పార్టీలో చేరేందుకు రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాల్‌ దగ్గర ఎదురు చూస్తున్న కృష్ణయాదవ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈటల వెళ్లిపోయినట్టు తెలిసింది. అయితే అదే రోజు ఉదయం మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడిని కాషాయకండువా కప్పి కిషన్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందే విద్యాసాగరరావు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయ్యి, వేములవాడ టిక్కెట్‌ను తన కొడుక్కి కన్ఫామ్‌ చేయించుకొచ్చారనే ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన ఈటల రాజేందర్‌ ఈ చేరికకు దూరంగా ఉన్నారు. దీనికి ప్రతిగా కృష్ణయాదవ్‌ను పార్టీలోకి తీసుకొనేందుకు కిషన్‌రెడ్డి అభ్యంతరం చెప్పారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అయితే మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమకు వేములవాడ టిక్కెట్‌ ఇప్పిస్తాననే హామీతో ఈటల రాజేందర్‌ తనతోపాటు బీజేపీలోకి తెచ్చారనీ, ఇప్పుడు విద్యాసాగరరావు కుమారుడు అక్కడి నుంచి పోటీలో ఉంటారనే విషయాన్ని ఈటల జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు తాను గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే, తన భార్య జమునను హుజూరాబాద్‌ నుంచి బరిలో దింపాలని ఈటల రాజకీయ వ్యూహం ఖరారు చేసుకున్నారు. కానీ కుటుంబపాలన అంటూ బీఆర్‌ఎస్‌పై దాడి చేస్తున్న బీజేపీ అధిష్టానం ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితులు లేవనీ చెప్తున్నారు. మొత్తానికి బీజేపీలో ఉన్న బీఆర్‌ఎస్‌ వ్యతిరేకులంతా గ్రూపు కట్టి, కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని తెలుస్తుంది. సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు కూడా బీజేపీ రాజకీయ నిర్ణయాలు, కిషన్‌రెడ్డి నాయకత్వంపై ఒకింత అసహనంతో ఉన్నట్టు సమాచారం. తాను బీజేపీలోనే ఉంటాననీ, వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచే పోటీచేస్తానని ఆయన పలుమార్లు చెప్పినా, ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. మరో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన రాజకీయ భవిష్యత్‌ ఏంటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. కొత్త నేతలు వచ్చి, పాత నేతలను డామినేట్‌ చేస్తున్నారని ఆయన మొదటి నుంచీ మొత్తుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీ కాదంటే…బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌ భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కూడా దీనికి సానుకూలంగా రాజాసింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించని విషయం తెలిసిందే. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు బీజేపీ తరఫున పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మరి బీజేపీ అభ్యర్థులుగా గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌కు, అంబర్‌పేట నియోజకవర్గం నుంచి సీ కృష్ణయాదవ్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది. మొత్తానికి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీలో అలజడి తీవ్రరూపం దాలుస్తున్నది.