మొరాకోలో భూకంపం వేలాది మరణాలు

Earthquake in Morocco Thousands of deathsరాబట్‌: శుక్రవారం సాయంత్రం మొరాకోలో సంభవించిన భూకంపంలో వేలాది ముంది ప్రజలు మృతి చెందారు. అనేక వేలమంది గాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం 2012మంది చనిపోయారు. 2059మంది గాయపడ్డారు. వీరిలో 1404మంది పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 269మంది మాత్రమే మరణించినట్టు ప్రకటించారు. అయితే ఈ సంఖ్య గంటగంటకూ పెరగటం మొదలయింది. చేరుకోవటానికి కష్టతరమైన మర్రాకేచ్‌కు దక్షిణానగల అట్లాస్‌ పర్వత శ్రేణుల్లో భకంపం కేంద్రీకృతం అవటంవల్ల ప్రాణ, ఆస్తి నష్ట పరిమాణాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మొరాకో రాజధాని రబట్‌లోను, మర్రాకేచ్‌ కాసాబ్లాంకా, అగదీర్‌, కనిట్రా వంటి ఇతర నగరాలలో కూడా ప్రకంపనలు వచ్చాయి. అనేకమంది ప్రజలు తమ ఆవాసాలను వదిలి రాత్రంతా రోడ్లపైనే ఉండి శిధిలాలను తొలగించటానికి సహాయపడ్డారు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విడియోలను బట్టి చూస్తే వేలాది భవానాలు పాక్షికంగానో, పూర్తిగానో దెబ్బతిన్నాయి.
మర్రాకేచ్‌ పాత నగరంలోని జెమా ఎల్‌ ఫ్నా స్వేర్‌ ప్రాంతంలో ఒక మసీదు, ఒక యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ నిర్మాణం, అనేక చారిత్రక భవనాలు దెబ్బతిన్నాయి. ప్రకంపనలు రాగానే ప్రజలు తమ నివాస ప్రాంతాలను వీడి పారిపోతున్న దృశ్యాలు కూడా విడియోలలో కనపడుతున్నాయి. మొరాకో నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోఫిజిక్స్‌ భూకంపాన్ని కొలిచి 7.0 స్థాయిదని తేల్చింది. ఈ భూకంపం కేంద్రకం అల్‌ హౌజ్‌ రాష్ట్రంలో ఉందని పేర్కొంది.
అమెరికా జియోలాజికల్‌ సర్వేని అనుసరించి ఈ భూకంపం 6.8గా ఉంది. 2004లో కూడా మొరాకోలోని మధ్యదరా సముద్ర తీరంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో 600మంది చనిపోయారు. 900మంది గాయపడ్డారు. ప్రస్తుత భూకంపం కారణంగా జరిగిన నష్టం అప్పటి భూకంపం స్థాయిని ఇప్పటికే దాటిపోయింది.