– 30న హాజరు కావాలని పిలుపు
గౌహతి : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార సభలో చేసిన ‘అక్బర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రికి ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 18న శర్మ చేసిన ప్రసంగాన్ని చూసినట్లైతే ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలుతోందని ఈసీ పేర్కొంది. ఈ నెల 30వ తేదీన సాయంత్రం 5గంటల్లోగా తమ ముందు హాజరు కావాల్సిందిగా శర్మను కోరింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు మీపై ఎందుకు చర్య తీసుకోరాదో తెలియచేయాలని కోరింది. శర్మ హాజరు కాని పక్షంలో ఇసి సముచితమైన నిర్ణయం లేదా చర్య తీసుకుంటుందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధాలో హిమంత బిశ్వాస్ శర్మ తన ప్రసంగంలో, అక్బర్‌ను పంపకపోతే మాత కౌసల్య భూమి అపవిత్రం అవుతుంది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ”ఒక అక్బర్ ఎక్కడికైనా వస్తే, అతను 100 మంది అక్బర్లను పిలుస్తాడు. కాబట్టి వీలైనంత త్వరగా అతన్ని పంపించి వేయండి, లేకపోతే మాత కౌసల్య భూమి అపవిత్రమవుతుంది, ”అని అతను చెప్పాడు. రాముని తల్లి అయిన మాతా కౌశల్య ఆధునిక ఛత్తీస్‌గఢ్‌కు చెందినదని హిందువులు నమ్ముతారు.
హిమంత బిశ్వాస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం రేగింది. శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ గురువారం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా శర్మ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్టు పెడుతూ ఈ విషయం తెలియచేశారు. ఈసీఐ దీనిపై చర్య తీసుకోగలదని భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ నేతలు, ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో వున్నవారు ఎన్నికల నిబంధనలను ఇలా అతిక్రమించడానికి అనుమతించరాదని అన్నారు.
దీనిపై అసోం సీఎం స్పందిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కవార్ద నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి పేరు మహ్మద్ అక్బర్ అన్న సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియచేయకుండా కాంగ్రెస్ దాచిపెట్టిందని విమర్శించారు. ఒక అభ్యర్ధిని చట్టబద్ధంగా విమర్శించడమనేది మతోన్మాద రాజకీయాల కిందకు రాదన్నారు. ఇంతటి కీలకమైన వాస్తవాన్ని దాచిపెట్టినందుకు కాంగ్రెస్ చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వుంటుందన్నారు. ఎన్నికల కమిషన్ విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలివేస్తున్నట్లు తెలిపారు.
‘అక్బర్’ వ్యాఖ్యలపై అసోంకు ఈసీ షోకాజ్ నోటీస్
2:31 am