– దేశంలో డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసు కంటే అధికంగా వినియోగం
న్యూఢిల్లీ : భారతీయులలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసిన దాని కంటే చాలా ఎక్కువ. భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇటీవల జరిపిన సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును వినియోగించకూడదని డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసు చేయగా భారతీయులు ఎనిమిది గ్రాములు తీసుకుంటు న్నారు. అదనపు ఉప్పు వినియోగం పురుషులలో అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలలో దీని వాడకం మరీ ఎక్కువ. అధిక బరువున్న వారు, ఊబకాయులు ఉప్పును ఎక్కువగా వాడుతున్నారని సర్వే తెలిపింది.
ఉప్పును అధికంగా వాడడం వల్ల కలిగే అనర్థాలు, తక్కువగా వినియోగించడం వల్ల ఒనగూడే ప్రయోజనాల విషయంలో ప్రజలకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. ఆహారంలో ఉప్పు వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకొని, అమలు చేయాలని సర్వే సూచించింది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, ఇంటి వెలుపల వండిన వంటకాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ సర్వేలో 18-69 సంవత్సరాల మధ్య వయస్కులైన 10,659 మంది పాల్గొన్నారని అధ్యయన రచయిత, ఐసీఎంఆర్ డైరెక్టర్ ప్రశాంత్ మాథుర్ చెప్పారు.
ఉప్పు వినియోగం తగ్గిస్తే…
ఉప్పు వినియోగం ఉద్యో గులలో (8.6 గ్రాములు), పొగాకు వినియోగదారులలో (8.3 గ్రాములు) అధికంగా ఉంటోంది. అధిక రక్తపోటు ఉన్న వారు రోజుకు 8.5 గ్రాముల ఉప్పు తీసుకుంటు న్నారు. ఉప్పును తగ్గించి వాడితే రక్తపోటును 25% నియంత్రించవచ్చునని, 2025 నాటికి ఉప్పును అధికంగా వాడుతున్న వారి సంఖ్యను 30% తగ్గించవచ్చునని సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది కంటే తక్కువ మంది మాత్రమే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గుండె జబ్బులతో మరణాలు అధికం..
దేశంలో సంభవిస్తున్న మరణాలలో 28.1% మరణాలకు గుండె జబ్బులే కారణం. 1990లో అధిక రక్తపోటు కారణంగా 0.78 మిలియన్ల మంది చనిపోగా ఆ సంఖ్య 2016 నాటికి 1.63 మిలియన్లకు పెరిగింది. సోడియంను అధికంగా వినియోగించడం వల్ల రక్తపోటు పెరుగుతోందని, అది గుండె జబ్బులకు దారితీస్తోందని సర్వే తెలిపింది.