ఈసీని నియంత్రించలేం

ఈసీని నియంత్రించలేం– వీవీప్యాట్లపై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వీవీప్యాట్ల వెరిఫికేషన్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్‌ చేసింది. మరో రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వచ్చే ఎన్నికల నిర్వహణలో తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేసింది. ఈవీఎంలలో నమోదయ్యే ఓట్లను పూర్తి స్థాయిలో వీవీప్యాట్లతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ విచారించింది. ఈవీఎంలపై ఈసీ తన వెబ్‌సైటులో ఇచ్చిన సమాధానాలలో కొంత గందరగోళం నెలకొని ఉన్నదని, అందువల్ల కొన్ని అంశాలపై తనకు వివరణలు అందజేయాలని గతంలో ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీప్యాట్లను లెక్కించగా వచ్చిన ఓట్లకు మధ్య తేడా ఉన్న ఉదంతాలు ఇప్పటి వరకూ కన్పించలేదని విచారణ సందర్భంగా జస్టిస్‌ దత్తా పిటిషనర్ల న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు గుర్తు చేశారు. ‘వీవీప్యాట్లలో ఐదు శాతం లెక్కించినప్పుడు అభ్యర్థి ఏదైనా తేడాను గుర్తిస్తే దానిని లేవనెత్తవచ్చు’ అని ఆయన అన్నారు. అయితే ఈ రోజు వరకూ అలాంటి ఘటనలు జరగలేదని అంటూ మరో రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ను తాము నియంత్రించలేమని చెప్పారు. వ్యవస్థలో ఏదైనా మెరుగుదలకు అవకాశం ఉంటే దానిని తాము తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్‌ ఖన్నా తెలిపారు. వీవీప్యాట్ల విషయంలో ఇప్పటికే తాము రెండుసార్లు జోక్యం చేసుకున్నామని గుర్తు చేశారు.
ఓటింగ్‌ ప్రక్రియను పెంచేందుకు సూచనలు కోరిన ప్రతిసారీ మళ్లీ బ్యాలెట్‌ పత్రాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారని జస్టిస్‌ ఖన్నా చెప్పారు. ఎన్నికల కమిషన్‌ తరఫున అధికారి వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియలో వినియోగించే సీయూ, బీయూ, వీవీప్యాట్‌లకు వేర్వేరుగా మైక్రోకంట్రోలర్లు ఉంటాయని, వాటికి భద్రత ఉంటుందని, వాటిని ఎవరూ తెరవలేరని వివరించారు.