ప్రధాని మోడీ, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు

– మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘించారంటూ…
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు ఒకడుగు ముందుకేసి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ని ఉల్లంఘిస్తున్నాయి. ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రసంగాలపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీని ఉల్లంఘించినందుకుగానూ దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలకు ఈసీ షాక్‌ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ని అతిక్రమించి నందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఆయా పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏప్రిల్‌ 29 ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈసీ నోటీసులో నిబంధనలు అతిక్రమించిన నేతల పేర్లను పేర్కొనకపోవడం గమనార్హం. ”సాధారణంగా పార్టీలు తమ అభ్యర్థుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారి ఆదేశాలు లేకుండా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. కానీ పార్టీల అధినేతలే ఈ కామెంట్లు చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి ప్రసంగాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఈసీ నిబంధనలు అతిక్రమించినందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నడ్డా, ఖర్గేలపై ఉంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ముఖ్యంగా స్టార్‌ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తమ అభ్యర్థులు, ముఖ్యంగా క్యాంపెయినర్ల ప్రవర్తనకు రాజకీయ పార్టీలు ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయని తెలిపింది” అని ఈసీ తన నోటీసులో పేర్కొంది.
ఇటీవల, రాజస్థాన్‌లోని ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి దేశ సంపదను పంచవచ్చు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ప్రధాని ‘ హిందువులు, ముస్లింలను విభజించాలని’ చూస్తున్నారని ఆరోపించింది. ప్రధాని వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. మరోవైపు రాహుల్‌ గాంధీ తన ర్యాలీలలో అనుచిత భాష ఉపయోగించారని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్‌ గాంధీ తమిళనాడులో భాషా ప్రాతిపదికన ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీలకు ఈసీ నోటీసులు పంపింది. నోటీసుపై ఇరుపార్టీలు ఇంకా స్పందించ లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న ప్రారంభమైంది. జూన్‌ 1 వరకు 44 రోజుల పాటు ఓటింగ్‌ ఏడు దశల్లో జరుగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.