బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ నోటీసులు

– నిబంధనలను అనుసరించాలని
– మీ స్టార్‌ క్యాంపెయినర్లను ఆదేశించండి
న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు బుధవారం ఎన్నికల సంఘం వేరువేరుగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలు అనుసరించాలని మీ స్టార్‌ క్యాంపెయినర్లను ఆదేశించాలని ఈ నోటీసులు ఈసీ స్పష్టం చేసింది. సమాజంలో విభజనలు సృష్టించే, కులాల మధ్య ఉద్రికత్తలకు కారణమయ్యే ప్రకటనలు చేయకుండా స్టార్‌ క్యాంపెయినర్లను నియంత్రించాలని పార్టీ అధ్యక్షులను కోరింది. స్టార్‌ క్యాంపెయినర్లు తమ ప్రసంగాలు మర్యాదగా చేసే బాధ్యత పార్టీ అధ్యక్షులదేనని తెలిపింది. ఇటీవల స్టార్‌ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపైనా విరుచుకుపడింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పార్టీల ప్రచారశైలిలో మార్పు రావడం లేదని, ఇకనైనా సరిదిద్దుకోవాలని నోటీసుల్లో ఈసీ పేర్కొంది. ప్రచారాల్లో మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని ఇరు పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. ముఖ్యంగా సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను చేయోద్దని తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను ఆదేశించాలని బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డాకు రాసిన లేఖలో తెలిపింది. గత నెలలో బన్‌స్వారాలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 13న నడ్డాకు ఈసీ నోటీసు జారీ చేసింది. దీనికి నడ్డా వివరణ తరువాత ఈ తాజా నోటీసు ఈసీ జారీ చేసింది.
అలాగే, కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జునకు జారీ చేసిన నోటీసుల్లో కులాల మధ్య ఉద్రిక్తతలు దారి తీసే విధంగా ప్రసంగాలు చేయవద్దని తమ స్టార్‌ క్యాంపెయినర్లును ఆదేశించాలని కోరింది. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రసంగాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అగ్నివీర్‌ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు.. సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని పేర్కొంది. అలాగే బీజేపీ, కాంగ్రెస్‌ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, వాటిని సమర్థించుకోవడాన్ని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరించాలని, అయితే ప్రతిపక్ష పార్టీకీ ఈ విషయంలో మినహాయింపు లేదని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థపై దేశ ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ఈసీ పేర్కొంది. దేశంలో సుదీర్ఘంగా సాగుతున్న సామాజిక, సంస్కృతిక వాతావరణాన్ని బలహీన పర్చడానికి రెండు పార్టీలకు అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది.