మంత్రి కేటీఆర్‌కు ఈసీ నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు (కేటీఆర్‌)కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 20వ తేదీ హైదరాబాద్‌లోని ‘టీ వర్క్స్‌’లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్ధులతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఉద్యోగార్ధులంతా మెట్లపై కూర్చుని ఉండగా, వారికి దిగువన మంత్రి కేటీఆర్‌ కూర్చుని ఉన్న ఫోటో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపైనే కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయం అయిన టీ వర్క్స్‌ని మంత్రి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారనీ, ఉద్యోగాల సంఖ్యను పెంచి, భర్తీచేస్తామని హామీ ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందికే వస్తుందనీ, అందువల్ల మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును పరిశీలించి, ప్రాథమిక దర్యాప్తు జరిపిన ఎన్నికల సంఘం ఈ అంశం ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందికే వస్తుందని భావిస్తూ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరింది.