మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులు

మోడీపై వివాదస్పద వ్యాఖ్యలు రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులున్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ‘జేబు దొంగ’, ‘అపశకుని’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీకి భారత ఎన్నికల కమిషన్‌ గురువారం నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు కమిషన్‌ ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఈ నెల 25 సాయంత్రం 6 గంటల్లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఈసీ ఆదేశించింది. ఇటీవల రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ధనాన్ని జేబుదొంగ మాదిరిగా ప్రధాని మోడీ లూటీ చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు మోడీ హాజరుకావడంతోనే భారత్‌ ఓడిపోయిందని, మోడీ ఒక ‘అపశకుని’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బుధవారం కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవ్వ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఇసికి ఫిర్యాదు చేసింది. ప్రధానమంత్రిని జేబుదొంగతో పోల్చడం, ‘అపశకుని’ అనే ఉపయోగించడం జాతీయ రాజకీయ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడికి తగదని బీజేపీ బృందం ఆరోపించింది. రాహుల్‌ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేని పేర్కొంది. రాహుల్‌పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, వార్తా పత్రికల్లో మభ్యపెట్టే రాజకీయ ప్రకటనలు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షులు గోవింద్‌ సింగ్‌ దోతస్రాకు బుధవారం ఈసీ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోడీపై ఆరోపణల విషయంలో గతవారంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది.