డీజీపీపై ఈసీ వేటు

డీజీపీపై ఈసీ వేటు– కోడ్‌ ఉల్లంఘించినందుకు సస్పెన్షన్‌
– ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు
– నూతన డీజీపీగా రవిగుప్తా నియామకం..ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, మరో ఇద్దరు అదనపు డీజీలు మహేశ్‌ భగవత్‌ (సీఐడీ అదనపు డీజీ), సంజరు కుమార్‌ జైన్‌ (రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ)లకు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఐపీఎస్‌ వర్గాల్లో కలకలం రేపింది. కాగా నూతన డీజీపీగా రవిగుప్తా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాళ్లోకెళ్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని సూచిస్తూ ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు అదనపు డీజీలు మహేశ్‌ భగవత్‌, సంజరుకుమార్‌ జైన్‌లు జూబ్లిహిల్స్‌లోని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, 9వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా చర్చించి అక్కడి నుంచి వెళ్లినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా రాజకీయ నాయకులను కలవరాదనే నిబంధనలు డీజీపీ అంజనీకుమార్‌ ఉల్లంఘించారంటూ ఆయననను వెంటనే సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, డీజీపీ వెంట వెళ్లిన ఇద్దరు అదనపు డీజీలకు తాము ఎందుకు అక్కడకు వెళ్లారో సమాధానమివ్వాలంటూ ఆ ఇద్దరు అధికారులకు కూడా నోటీసులను జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన తాజా ఆదేశాలు రాష్ట్ర పోలీసు శాఖలో కలకలం రేపాయి. అప్పటికే ఈ ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు రేవంత్‌రెడ్డిని కలవటంపై ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ సాగింది.
ఎన్నికల వేళ పోలీసు అధికారుల బదిలీలు, సస్పెండ్‌లు
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సి.వి ఆనంద్‌, వరంగల్‌ కమిషనర్‌ రంగనాథ్‌, కరీంనగర్‌ కమిషనర్‌ సుబ్బారాయుడు, నిజామాబాద్‌ కమిషనర్‌ సత్యనారాయణతో పాటు 23 మంది ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. అనంతరం, సోదాల సందర్భంగా దొరికిన డబ్బులకు సంబంధించి అసలు నిందితుడి పేరును కప్పి పుచ్చటానికి ప్రయత్నించారనే ఆరోపణలపై నగర సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్‌ సీఐ జహంగీర్‌లను కూడా ఈసీ సస్పెండ్‌ చేసింది.
ఇన్‌చార్జీ డీజీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి?
ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వెల్లడై రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో శాంతి భద్రతను పర్యవేక్షించాల్సిన డీజీపీ పోస్టు ఖాళీగా ఉండకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టిని సారించినట్టు తెలిసింది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన డీజీపీ పోస్టుకు సీనియర్‌ ఐపీఎస్‌ను ఎంపిక చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయటం, కొత్త కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటానికి సమయం పడుతుండటంతో అప్పటి వరకు తాత్కాలికంగా ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని ఇన్‌చార్జీ డీజీగా నియమించే అవకాశాలున్నాయని ఐపీఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో ప్రస్తుతం డీజీపీ స్థాయి హౌదాలో ఉండి రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా ఉన్న జితేందర్‌, రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ రవి గుప్తాలు ఎంపిక చేయగా..రవి గుప్తాను రాష్ట్ర డీజీపీగా నియమించింది.