– వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశాలు
– కార్మికులకు నైట్‌షిప్టు డ్యూటీలు వేయొద్దు : మెమో జారీ చేసిన కార్మిక శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోలింగ్ సందర్భంగా సోమవారం నాడు డే షిప్టు, నైట్ షిప్టు అనే తేడా లేకుండా కార్మికుంలందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాసిన లేఖకు ఎన్నికల సంఘం స్పందించింది. అందరికీ వేతనంతో కూడిన సెలవును అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని మెమో విడుదల చేశారు. కంపెనీలు ఏవైనా సోమవారం సాయంత్రం తర్వాత నైట్ షిప్టులు కొనసాగించినట్టు తమ దృష్టికొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆదేశాలు జారీ చేసినందుకు ఈసీకి, కార్మికశాఖకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ.నర్సింహారావు ధన్యవాదాలు తెలిపారు. నైట్‌షిప్టులో కార్మికులతో పనిచేయించుకునేందుకు కార్మిక శాఖ అనుమతులు ఇవ్వడంపై ఆదివారం హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ.నర్సింహారావు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కార్యదర్శి రాసిన లేఖను అందించారు. కార్మికుల ఓట్లు పనిప్రదేశ ప్రాంతంలో కాకుండా సొంతూర్లలో ఉంటాయనీ, వారు ఓటేసి నైట్‌డ్యూటీ షిప్టుకు ఎలా రాగలుగుతారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రెండు షిప్టులకే సెలవు వర్తింపు అని కార్మిక శాఖ జారీ చేసిన మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పూర్తివేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ 116 ప్రకారం గెజిట్ నెంబర్ 107లో కూడా కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నేషనల్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీస్(నాస్కామ్), యాజమాన్య సంఘాలు రెండు షిప్టులకే సెలవును పరిమితం చేయాలని కోరగా కార్మికశాఖ అందుకు సానుకూలంగా స్పందించడం దారుణమన్నారు. ఈసీ ఆదేశాన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా నైట్ షిప్టుకు హాజరయ్యే వారికి సెలవును రద్దు చేస్తూ మెమోను విడుదల చేయడం సరిగాదని తెలిపారు. దీనివల్ల ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈసీ తక్షణమే జోక్యం చేసుకుని జీవో నెంబర్ 222 ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కార్మికులకు వేతనంతో కూడిన పూర్తి సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ప్రతి ఒక్కరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.