కేసీఆర్‌కు ఈసీ షాక్‌ 48 గంటల నిషేధం

EC shock for KCR 48 hour ban– కాంగ్రెస్‌ నేతలపై అసభ్య వ్యాఖ్యల పట్ల ఎన్నికల సంఘం సీరియస్‌
– ఎలాంటి రోడ్‌ షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్ర శేఖర్‌ రావు ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్రేక్‌ వేసింది. కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర నేతలు చేసిన ఫిర్యాదుపై చర్యలు చేపట్టింది. ఇతర రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయకూడదన్న ఎన్నికల నియమావళిని కేసీఆర్‌ ఉల్లంఘించారని పేర్కొంది. అందుకు గాను ఆర్టికల్‌ 324 ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి 48 గంటలు ఎలాంటి రోడ్‌ షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని నిషేధం విధించింది. ఎలాంటి బహిరంగ సభలు, ప్రజల ఊరేగింపులు, ర్యాలీలు, షోలు, మీడియాలో ఇంటర్వ్యూలు, పబ్లిక్‌ ప్రచారాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఈసీఐ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మలై మల్లిక్‌ నాలుగు పేజీల ఉత్తర్వులను విడుదల చేశారు. ఏప్రిల్‌ 5న సిరిసిల్లలో మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ ‘ప్రజలను బతకడానికి పాపడాలు, నిరోధులు అమ్ముకోమని చెప్పడానికి కాంగ్రెస్‌ నేతలు కుక్కల కొడుకులా?. నీళ్లివ్వడం చేతకాని లత్కోర్లు రాజ్యమేలుతున్నరు. అసమర్థులు, చవటలు, దద్దమ్మలు ఈ రాజ్యంలో ఉన్నరు. అబద్ధాలతో కేవలం 1.8 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చారు. పంటలకు రూ.500 బోనస్‌ ఇవ్వకపోతే మీ గొంతు కోస్తం, చంపేస్తాం’ అని కేసీఆర్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌ పై ఏప్రిల్‌ 6న టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీ నిరంజన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో పుటేజీ, ఇతర సాక్ష్యాధారాలను అందించారు. అలాగే ఈసీ.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఇంగ్లీష్‌లోని అనువదించి పంపించారు. ఈ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ కేసీఆర్‌ పై చర్యలు తీసుకుంది. సిరిసిల్ల లో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నట్లు స్పష్టం చేసింది. ఆయన ఎన్నికల ప్రచారం పై తాత్కాలిక నిషేధం విధించింది.