నవతెలంగాణ – న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ కీలక ప్రకటన జారీ చేసింది. రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ ప్రచారం కోసం పార్టీలు కానీ అభ్యర్థులు కానీ చిన్న పిల్లలను వాడకూడదని ఈసీ పేర్కొన్నది. ర్యాలీలు, ప్రచారం, ప్రకటనల్లో పిల్లలను దూరంగా ఉంచాలని ఈసీ తన ప్రకటనలో వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. పోస్టర్లు, పాంప్లెట్ల పంపిణీ కానీ, నినాదాలు చేయడానికి కూడా పిల్లలను వాడకూడదని ఈసీ తెలిపింది. ర్యాలీల సమయంలో తమతో పాటు చిన్న పిల్లలను తీసుకువెళ్లరాదు అని పేర్కొన్నది. ఈ నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈసీ వెల్లడించింది.