గ్రహాలు ఎందుకో
గతులు తప్పుతున్నాయి
ఒక్కసారిగా మూర్చపోయిన సూర్యుణ్ణి
యుద్ధ మేఘపు చీకటి ఆవహిస్తోంది
దేశాల సరిహద్దులు దాటుకుని
ట్యాంకర్లు ముందుకే వెళ్తున్నాయి
ఆయుధ బేహారులకు
ఆయుధాల అమ్మకమే జరగాలి
శాంతి కపోతం ఎగిరేందుకు రెక్కలు కరువు…
దాహమేసిందా స్వప్నాలకి
ఎప్పుడూ కన్నీళ్లనే తాగేస్తుంటాయి
నీరింకిన కన్నుల్లో చూపు పలచనవుతోంది
ఉదయపు కిరణం ఎపుడూ
పనికే వెళ్ళమంటుంది
బద్దకానికి ఓటేస్తే ఆకలి కడుపులోనే గూడు కడ్తుంది
అనాథలవుతున్న పిల్లలకి
అన్నం మెతుకు జాడేది
సగటుజీవి బతుకుపోరాటం
ఇంకెపుడు గెలిచేది…
వీధి వీధినా తుపాకిశబ్దాలు బాంబు పేలుళ్ళు
తెగల మధ్య ద్వేషాలు కులాల మధ్య మంటలు
ప్రాణం పోసే రసవిద్య
వీనికి ఎవనికైనా ఎరుకేనా?
ఎక్కడి నుండో వచ్చింది తెల్ల పావురం వాలింది
కన్నతల్లి పేగు పురిటి నొప్పులు పడుతోంది
కత్తులు తుపాకులు
పొలంగట్టున ఇక దిష్టిబొమ్మలు
పసిపాపల కేరింతలు నవ్వులు ప్రపంచపు ఎకో….
– అశోక్ గుంటుక, 9908144099