పరిశీలనాత్మక కథలు బల్కావ్‌

Eclectic Stories Balkawచూసే సినిమాకు చదివే కథకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సినిమా ఏ దృశ్యాన్ని చూపుతుందో మెదడు దానినే నిక్షిప్తం చేసుకుంటుంది. అదే ఏదైనా కథ చదువు తున్నప్పుడు ఊహకు రెక్కలు వస్తాయి. ఆకాశంలో విహరిస్తాము. ఏ ఒక్క ఆలోచనకు సరిహద్దులంటూ ఉండవు. అదే కదా కథ గొప్పతనం. అందుకే పేదరాశి పెద్దమ్మ కథల నుంచి ఇప్పటికీ కథ అంటే చెవి కోసుకొని వినాలనుకుంటారు. చదవాలనుకుంటారు. అందుకే కథలు ఇప్పటికీ పచ్చగా మనగలుగుతున్నాయి.
ఊహకు అంతం లేనట్లే, శ్రీ ఊహ కలానికి అందని సబ్జెక్టు లేదేమో అనిపిస్తుంది ఈ కథలు చదువుతున్నప్పుడు. ఒక కథా ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ఆ ప్రపంచం ఎంతైనా విస్తరించి ఉండొచ్చు. పంచభూతాలను ఏకం చేస్తూ ఏ అంశాన్నైనా ఎంపిక చేసుకోవచ్చు అది రచయితకుండే స్వేచ్ఛ. సౌలభ్యం. ఈ కథా సృజనలో శ్రీ ఊహ తనకున్న వెసులుబాటును చక్కగా వినియోగించు కున్నారనిపిస్తుంది. తాను ఊహించిన ప్రపంచానికి వాస్తవిక రంగులద్దారు.
ఇటీవలే ఇసుక అద్దం పేరుతో సరికొత్త కథలను తనదైన శైలిలో పరిచయం చేసారామె. ఆ కథలు పాఠకుల ఆదరణ చూరగొన్నాయి. తదుపరి పుస్తకం బల్కవ్‌ లోనూ వైవిధ్యమైన కథలను అందుబాటులోకి తెచ్చారు. బల్కవ్‌ అంటే బాల్కనీ. ఈ కథలను ఏ చారు తాగుతూనో, ప్రకృతిని ఆస్వాదిస్తూనో ఒక్కో కథను చక్కగా ముగించవచ్చు. ముగించిన తరువాత కూడా కథావరణంలోకి చొచ్చుకొని పోయిన మనం అంత తొందరగా బయటకు రాలేము. ఆ బస్తీ గల్లీల్లోనో, ఆ రోడైలపైనో కథల్లో తారసపడిన మనుషులను వెతుక్కుంటాం.
బల్కావ్‌లో పది కథలు ఉన్నాయి. పది కథలద్వారా పది ప్రపంచాలు పరిచయం అవుతాయి. ఒక కథ అకస్మాత్తుగా పాతబస్తీలో పరిచయమైతే మరో కథ ఏ వర్జీనియాలోనో మొదలవొచ్చు. పదింటికీ పది ప్రాంతీయ నేపథ్యాలు ఉన్నాయి. పది జీవన వేదనలు ఉన్నాయి. కథల కోసం ఎంపిక చేసుకున్న వస్తువులు కేవలం తన మస్తిష్కంలో పుట్టిన ఊహా నేపథ్యాలు మాత్రమే కావు. తనకు తెలిసిన చిన్న సంగతికి తనకేమాత్రం తెలియని అతిపెద్ద చరిత్రను వెతికి, పరిశోధించి కథలను పరిపుష్టం చేసిన శ్రమ కథలు. ఈ కథలను పరిశోధన పరిశీలన కలగలుపుగా చెప్పవచ్చు. ఈ ప్రక్రియ తనకు గొప్ప అనుభూతినిచ్చిందని ఒకచోట తన సంతృప్తి వెలిబుచ్చారు రచయిత్రి.
కథలను కథలుగానే చూడకుండా అందులోనే భాష కూడా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. అలాగే మనదైన ఈ భాషను ఆస్వాదించవచ్చు. గోవాలో ప్రారంభమయ్యే కథ కావచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేపథ్యంలో జరిగే ఒక ధూల్పేట కుర్రాడు జీవనాన్వేషణ కావచ్చు. ప్రతి దాంట్లోనూ పొరలు పొరలుగా విడివడుతూ కథకు కొత్తదారులు మన ఊహ లోకంలోనే తెరుచుకుంటాయి. ఈ కథలన్నీ మనం చదువుతూ ఎంతవరకు ఊహించగలమో అంతటి ఊహకు అవకాశం ఉన్న కథలు.
సాధారణంగా ట్రావెలాగ్‌ అనగానే తాము వెళుతున్న లేదా తమ సందర్శించిన ప్రాంతాల చరిత్రను వాటిని సందర్శించిన అనుభూతులను పంచుకుంటూ ఉంటారు. శ్రీ ఊహ వీటికి తన మనసును జోడించారు. అందుకే ప్రతి కథలోనూ జీవన లాలస కనబడుతుంది. ఒక కొత్త ఆశను జోడించుకున్న ప్రేమైక కథలయ్యాయి. ప్రతి మనసు పడే సంఘర్షణకు అద్దంపట్టే కథలూ అయ్యాయి. ఒంటరిగా, స్వేచ్ఛగా ఒక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మనకు తెలియకుండానే సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌ ఏ రకంగా ఉంటుందో అనుభవ పూర్వకంగా చెప్తారు రచయిత్రి. తాను వెళ్లిన ప్రతి ఊరు ఒక కొత్త కథాస్థలే తనకు. తాను కలిసిన ప్రతి మనిషీ ఆమెకో హ్యూమన్‌ లైబ్రరీయే. తన వెతుకులాట అంతా కూడా వివిధ ప్రాంతాల్లోని మనుషులంతా ఒక్కటేనని, వారంతా సమానమైన జీవన వేదనలే అనుభవిస్తున్న వారని చెబుతారం. స్థలం, కట్టుబొట్టుల్లో మాత్రమే మార్పు ఉంటుంది అంటారు.
ఈ ప్రయాణాన్నంతటినీ తను ‘ఒక సోల్‌ లిబరేటింగ్‌ ఎక్స్పీరియన్స్‌’గా చెప్పుకున్నారు. ఇది మాత్రమే కాదు విజయవాడలో ఆదిలాబాద్‌, వరంగల్‌, ఢిల్లీ, కోకాపేట్‌, బందర్‌ సీంద్రి తదితర ప్రాంతాల్లోనూ తాను స్వేచ్ఛగా సందర్శించి, తనకు కావలసిన సమాచారాన్ని సేకరించి దానికున్న ఆథెంటిసిటీని పరిశీలించి మరీ కథలుగా రూపుదిద్దిన ఈ ప్రయత్నానికి రచయిత్రికి ప్రత్యేక అభినందనలు. పుస్తకము చదువుతున్నంతసేపూ ప్రతి కథకు ఒక్కొక్క ప్రాంతాన్ని మనం సందర్శిస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. ఆ కథలో మనము ఇమిడిపోయి ఆ ప్రాంతాల్లో ఆ పాతబస్తీ గల్లీలో మనము ఒక స్కూటీ వేసుకునో బైక్‌ లోనూ తిరుగుతూ అక్కడి ప్రజలను గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం సాధించుకున్న అనుభవాలే సాధిస్తేనే తప్ప తెలుసుకోలేని అనుభూతులు ఇక్కడ మరొక అంశాన్ని కూడా జోడించదలిచాను మహిళలు.. అందునా రచయిత్రులు ఏ బాదరబందీ లేకుండా వివిధ ప్రాంతాలను స్వేచ్ఛగా సందర్శించగలిగితే ఇటువంటి చక్కటి కథలు మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను.
– నస్రీన్‌ ఖాన్‌
writernasreen@gmail.com