పర్యావరణహితంగా దీపావళి…

Environmentally friendly Diwaliపల్లె నుంచి పట్టణం వరకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీపావళికి టపాసుల మోతమోగిస్తారు. ఈ సందర్భంగా వాయు కాలుష్య స్థాయి కూడా ఏడాదికేడాదీ పెరిగిపోతున్నది. వాయు కాలుష్యం ఎంత ప్రమాదమో మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్షంగా చూశాం. టపాసుల్లో వాడే విషపూరిత రసాయనాలతో వచ్చే కాలుష్యం అనేక మందిని రోగాలబారిన పడేస్తున్నది. ఆస్తమా, ఎలర్జీ తదితర వ్యాధులున్న వారు పరిస్థితి చెప్పనే అక్కరలేదు. అందుకే దీపావళిని పర్యావరణహితంగా జరుపుకుందాం. మనల్ని, మూగజీవాలను, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇక వాయు కాలుష్యం నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి పరిశీలిద్దాం.
దీపావళి రోజు వచ్చే వాయు కాలుష్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పటాకులు కాల్చడం వల్ల వచ్చే విపరీత వాయువు నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మాస్క్‌ ఉపయోగించాలి. ముఖ్యమైన పని అయితేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలి.
ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌…
వాయు కాలుష్యం ఇంట్లోని గాలిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంటి లోపల మంచి నాణ్యమైన గాలి కోసం ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించండి.
మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి
దీపావళి సందర్భంగా అధిక కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితి లో.. నీరు అధికంగా తాగాలి. దీంతో మన శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. తద్వారా శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నీరు తాగటంవల్ల మీ శరీరం హైడ్రేట్‌గానూ ఉంటుంది.
రోగనిరోధక శక్తిని జాగ్రత్తగా చూసుకోండి:
కాలుష్యం ప్రభావాలను నివారించడానికి.. మీ రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అల్లం, పసుపు, తేనె, సిట్రస్‌ పండ్లను తీసుకోవాలి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.