ECO గణేశ పర్యావరణానికి ఏకైక ప్రమాణం

ECO Ganesha is the only standard for environmentవినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చెరువులు, కుంటల దగ్గరకు వెళ్లి పూడికలు తీసి, అక్కడి మట్టితోనే ఈ విగ్రహాలు చేయాలని ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు.

వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్ల పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.
వినాయక చవితి వర్ష ఋతువు రెండవ భాగంలో వస్తుంది. అప్పటికి వాతావరణంలో అనేక మార్పులు జరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మనిషికి ప్రకతి సహజమైన వైద్యం గణపతి పూజలో ఉంటుంది. పూజలో వాడే వివిధ రకాల పత్రులన్నీ వైరస్సులనీ బాక్టీరియాను నిర్మూలించటానికి ఉపయోగపడేవి. వాటిని సేకరించడం, పూజలో వినియోగించడం ద్వారా పూజ చేసిన వారు ఫలితం పొందుతారు. అదే విధంగా చెరువులు నదులు వర్షపు నీటి కారణంగా మలినమై ఉంటాయి.
వర్షాలు బాగా పడి, పిచ్చి మొక్కలు పెరిగి అవసరమైన మొక్కలకి దారి దొరకకుండా పోతుందని పత్రి పూజ పెట్టారు. చెరువులు పూడిక తీసిన బంక మట్టితో వినాయకుడిని చేస్తే, చవితి రోజు వర్షాలకు చెరువు నిండుతుందని నమ్మకం. అప్పుడే పూడిక తీసిన చెరువు నీళ్ళని పీల్చేస్తుంది కాబట్టి మళ్ళీ బంక మట్టితో చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే ఫ్లోర్‌ ప్లాస్టింగ్‌ అవుతుందని శాస్త్రీయ కారణం.
ఇప్పుడు చెరువు ఆధారిత వ్యవసాయం చేస్తున్నవాళ్ళు ఎంతమంది? అక్కడ బంక మట్టితో నిమజ్జనం చేస్తున్నవాళ్ళు ఎంతమంది?
సాధారణంగా వినాయక చవితి, దసరా ఉత్సవాలు భాద్రపద మాసంలో అంటే వర్షాలు పడే కాలం. చెరువుల్లో, నదులల్లో, సరస్సుల్లో వర్షానికి మట్టి కొట్టుకుపోతుంది. క్రిమి కీటకాలు నీళ్ళలో బాగా అభివద్ధి చెందుతాయి. కనున మనం పూర్వం రోజులలో మట్టి విగ్రహాలను నిలబెట్టి 3, 5, 7, రోజులు పూజలు చేసి నిమజ్జనం చేసేవారు. అంతేకాక వినాయక చవితి కి 21 రకాల మొక్కల ఆకులతో పూజ చేస్తారు. దానినే పత్రి అంటున్నాం. ఈ 21 రకాల పత్రి ఆకులు ఈ 3 రోజుల పూజలో బాగా ఎండి, మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసినపుడు మట్టితో కలిసి ఒక కెమికల్‌ రియాక్షన్‌ రిగి నీటిలో ఉండే కరిమి కీటకాలు హరిస్తాయి. ఇది వినాయకుని నిమజ్జనంలోని ముఖ్యమైన కోణం.
గణేష్‌ చతుర్ధీ, దశమి ఉత్సవాలకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు పూజ చేయడం చాలా మంచి పని. వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడ్డాయి. అలాంటి వినాయక ప్రతిమలు చూడ్డానికి కూడా ఎంతో అందంగా వుంటాయి. కానీ ప్రస్తుతం.. ‘ధోని గణపతి, గబ్బర్‌ సింగ్‌ గణపతి, బాహుబలి గణపతి, స్పైడర్‌ మాన్‌ గణపతి బుల్లెట్‌ గణపతి… ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు?
ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో ఎన్నో మండపాలు. ఒక మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు. ఒక కాలనీలో ఒకే మండపం అయితే ఐక్యమత్యం పెరిగినట్లు. సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. మట్టి వినాయకుణ్ణి తయారుచేసి.. లేదా కొని కొనిపించి ప్రోత్సహించండి.
ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను, పేపర్‌ గణపతులను ఎకో ఫ్రెండ్లీగా పంచిపెడుతున్నాయి. మనవంతు ప్రయత్నం మనమూ చేద్దాం. గణపతి బప్పా మోరియా.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008577834