అభివృద్ధికి కొలమానం ఏమిటి? ఆర్థిక అంతరాలు రోజురోజుకి పూడ్చలేని అగాధాలుగా మారుతున్న వేళ మనం కూడా అగ్రరాజ్యాల సరసన చేరుతున్నామన్న ‘హెచ్చులకు’ అర్థం ఏమన్నా ఉంటుందా? పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం నిర్మూలించనంతవరకు ప్రజాజీవితాలకు వెలుగెక్కడీ ఈ మౌలిక సమస్యలకు పరిష్కారం చూడకుండా, చూపకుండా పాలకులు ప్రజల్ని ఎంతకాలం పసలేని మాయమాటలతో మోసగిస్తారు? ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజలనుండి ధర్మాగ్రహంతో ఉబికి వస్తున్న ప్రశ్నలు.
మన దేశ జనాభా దాదాపు 145 కోట్లు. 140 కోట్ల జనచైనాను గత ఏడాదే మనం అధిగమించాం. 2011 సం|| తర్వాత మన దేశంలో జనగణనే జరగలేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి జనావళికి దిక్సూచిలా పథనిర్దేశం చేయవలసిన పాలకులు ఉదాశీనత వహించడం క్షంతవ్యం కాదు.
ఇటీవల విడుదలైన ప్రపంచ జనాభా గణదృశ్యమే (డబ్ల్యు.పి.పి) నేడు మనకు దిక్కయింది. వయో, లింగ బేధాల కారణంగా మన దేశ జనాభా భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నది ఈ సంస్థ అంచనా వేసింది. సమీప భవిష్యత్‌లో జన విస్ఫోటనం మన దేశంలోనే అత్యధికంగా ఉంటుంది. 2080 నాటికి ప్రపంచ జానాభా వెయ్యి కోట్లు దాటుతుంది. మన దేశ జనాభా కూడా ఈ క్రమంలో 2060 వరకు గణనీయంగా పెరుగుతూనే పోతుంది.
ప్రస్తుతం మనదేశంలో పనిచేసే వయసుగలిగిన వారు 86 కోట్ల మంది ఉన్నారు. 2049 వరకు ఈ సంఖ్య ఇలానే పెరుగుతూ పోతూ వంద కోట్లకు చేరుకుంటుంది. అయితే వందకోట్ల మందికి పూర్తిస్థాయి ఉపాధి కల్పించి, తగిన నైపుణ్య సామర్థ్యాలను అందించినపుడు మాత్రమే దేశాభివృద్ధికి నిజమైన నిర్వచనం చెప్పగలం. కానీ మన పాలకులు ఇవేమీ పట్టించుకోకుండా 2047కల్లా భారత్ మూడో అగ్రదేశంగా మారుతున్నట్టు తెగ ఊదరకొడుతున్నారు.
ఇటీవల గుజరాత్‌లో కేవలం పది ఉద్యోగాలకు 1800 మంది హాజరుకావడం, ముంబైలో రెండె వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరై తొక్కిసలాటకు గురికావడం ఏం సూచిస్తున్నది? నిరుద్యోగ తీవ్రత ఊబిలోకి యువత కూరుకుపోవడం కాదా…..? కనిపిస్తున్నది.
రానున్న కాలంలో మనతో పాటు ఆఫ్రికా ఖండంలో (సోమాలియా, కాంగో) జనాభా పెరగనుంది. ఆఫ్రికా ఖండం అంటేనే వజ్రాల సహజవనరుల గని, ఆ నిధి నిక్షేపాలపై కన్నేసిన బహుళ జాతి కార్పోరేట్ కంపెనీలు మరి ఆ దేశ ప్రజానీకాన్ని పేదరికం నుండి విముక్తి చేస్తాయా? విముక్తి చేయరనేది చరిత్ర చెబుతున్న సత్యం. కాగా మన పొరుగు దేశం పాకిస్తాన్ కూడా 39 కోట్లకు చేరుకుంది. అమెరికా జనాభాను దాటి మూడవ అతిపెద్ద జనాభా దేశంగా అవతరించింది. జనాభా పెరుగుతున్న ఈ దేశాల్లో పేదరికం, నిరుద్యోగం సమాంతరంగా పెరుగుతున్న వైనం దోబూచులాడు తున్నది. అంటే కార్పోరేట్ల అమానవీయ దోపిడీని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆత్మహత్యలు అందుకు ఓ సంకేతం.
2022లో మన దేశంలో 1 లక్షా 71 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలిపింది. సగటున ప్రతి ఏడాదికి 12-13 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రపంచ రికార్డు. వ్యవసాయ రంగంలో 11,290 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్ని వృత్తులకు తల్లి వృత్తి వంటి వ్యవసాయ వృత్తి సంక్షోభ నివారణ దిశగా పాలకులు శాస్త్రీయ చర్యలు చేపట్టని బాధ్యతా రాహిత్యం ఇక్కడ కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నది.
మరి భారతదేశం వ్యవసాయ దేశం. రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకునే మాటలకు ఏమైనా పొంతన ఉన్నదా? అందుకే ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత సమస్యలని కాకుండా, సామాజిక సమస్యలుగా పరిగణించి పరిష్కార చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించవలసి వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓ విధంగ పాలకులకు చెంపపెట్టు.
ఇకపోతే పాలకుల ఆర్థిక గణాంకాలు అభివృద్ధి ప్రచారంలో ఉన్నంత మోజు సమస్యల పరిష్కా రంలో ఉండదన్నది మరో యదార్థం. 29 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంటే. నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో మన భారత్ ఐదో స్థానంలో ఉన్నది. త్వరలో జపాన్, జర్మనీలను అధిగమించి మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నట్టు పాలకులు భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. చైనా ద్వితీయ స్థానంలో ఉన్నది.
అమెరికా తలసరి ఆదాయం 85 వేల డాలర్లు అయితే చైనా తలసరి ఆదాయం 13వేల డాలర్లు, మరి మన తలసరి ఆదాయం మూడువేల డాలర్ల లోపే. 2400 డాలర్లు. అంటే సుమారు రెండు లక్షల రూ||లు అన్నమాట.
జీడీపీ(జాతీయ స్థూల ఆదాయం)లో మనం జర్మనీని అధిగమిస్తే అధిగమించ వచ్చుగాక. మరి జీవన ప్రమాణాల్లో మనది జర్మనీలో 20వ వంతంటే ఎంత దిగువన…? అదీ సగటు విషయం. దిగువన ఉన్న పేదరికం వారిని గమనిస్తే మరెంత పాతాళంలోకి పడిపోతామో ఊహించుకోవచ్చు.
శ్రమజీవులు సంపద సృష్టిస్తూ, పెంచుతూ పోతూ ఉంటారు. కానీ అవి సంపన్నుల చెంతకు చేరుతూ గుట్టలు గుట్టలుగా పేరుకు పోతాయి. పెట్టుబడిదారీ దోపిడీ చట్రంలో సంపద సక్రమంగా పంపిణీ జరగదని ఆర్థిక అగాదం ఇలా పేరుకుపోతూనే ఉంటుందని మార్క్స్ చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ రుజువు అవుతూనే ఉంటాయి.
దాదాపు 80 కోట్ల మందికి మన దేశంలో పాలకులు ఉచిత బియ్యం అందిస్తున్నారంటేనే మన పేదరికం స్థాయిని పాలకులు చెప్పకనే చెబుతున్నారు.
80 శాతం జనాభా ప్రభుత్వ రాయితీలపైనో సంక్షేమ పథకాలపైనో ఆధారపడి జీవించక తప్పడం లేదు. అంటే మనది ఎంత లోపభూయిష్టమైన ఆర్థికాభివృద్ధో వేరే చెప్పక్కర్లేదు. ఆకలి ఎక్కువగా ఉన్న దేశాల్లోని (హంగర్ ఇండెక్స్) 125 దేశాలలో 111వ స్థానం మనది. ఒక శాతం అపర కుబేరుల వద్ద 40 శాతం పైగా దేశ సంపద పోగుబడి ఉంది. దిగువనున్న 50 శాతం జనాభా వద్ద కేవలం 15శాతం సంపద మాత్రమే ఉంది. మన దేశంలో 40 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో జీవిస్తున్నారు. దేశ భవితను జవసత్వాలతో నింపాల్సిన బాలభారతం విషాదస్థితి ఇది. ఆదాయ అసమానతలు గల దేశాల్లోని 146 దేశాల్లో మన దేశ స్థానం 123. మరి మన దేశం ప్రగతి పథంలో నడుస్తున్నదని గుండెమీద చేయి వేసుకుని ఎలా చెప్పగలం?
‘కష్ట జీవుల రక్తం కలవారల భుక్తం, కమ్మిందీ సమాజాన్ని కారుమబ్బులా…’ అని కవి నార్ల చిరంజీవి ఏనాడో చెప్పిన మాటలు ఈనాటికీ సత్య దూరం కాదు కదా!
– కె. శాంతారావు
9959745723