రైతుల ఆర్థిక ప్రగతికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌రంగ పురోగతి అవసరం

For economic progress of farmers Advancement in food processing is essential– చికాగో ఫుడ్‌స్టాప్‌ సందర్శన
– అమెరికాలోని వరల్డ్‌ చికాగోలో ఫుడ్‌ ఇన్నోవేషన్‌ అంశంపై సమావేశంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పురోగతికి, తెలంగాణ ఆహార ఉత్పత్తుల్లో ఇన్నోవేషన్‌, ఆహార అలవాట్ల చరిత్రను భద్రపరచడం వంటి అంశాల కోసం తెలంగాణ ఫుడ్‌స్టాప్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రైతుల ఆర్థిక ప్రగతికి పుడ్‌ ప్రాసెసింగ్‌ పురోగతి అవసరం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ తన పర్యటనలో భాగంగా అనేక పెట్టుబడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆదివారం చికాగో నగరంలో చికాగో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఈకో సిస్టంను అధ్యయనం చేశారు. చికాగో నగరంలోని చికాగో ఫుడ్‌ స్టాప్‌ను సందర్శించి అక్కడ వరల్డ్‌ బిజినెస్‌ షికాగో సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ‘చికాగో నగరానికి చెందిన పబ్లిక్‌, ప్రయివేటు ఆర్థిక అభివృద్ధి ఏజెన్సీగా వరల్డ్‌ బిజినెస్‌ చికాగో పనిచేస్తుందన్నారు. చికాగో ఫుడ్‌ స్టాప్‌లో ఏర్పాటు చేసిన అనేక షాపులను ఆహార పద్ధతులు, వాటి చరిత్ర, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన వంటి అంశాలను పరిశీలించినట్టు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూనే తమ ఆహార ఉత్పత్తులు, ఆహారపు అలవాట్లపై ప్రత్యేకతలను జోడిస్తూ వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు పంచుకుంటూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ అందుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను చికాగో ఫుడ్‌ స్టాప్‌ కలిగి ఉందన్నారు.
చికాగో నగరం ఫుడ్‌ ఇన్నోవేషన్‌ సాంప్రదాయకంగా వచ్చిన ఆహారపు అలవాట్లు, ఆహారపు ఉత్పత్తుల సరఫరా వంటి అంశాలను కాపాడుకోవడంలో అగ్రస్థానంలో ఉన్నదని చికాగో ఫుడ్‌ స్టాప్‌ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ప్రస్తుత ఆధునిక జీవితంలోనూ అత్యంత కీలకమైన ఆహారపు ఉత్పత్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను వృద్ధిపరిచేందుకు తీసుకోవాల్సిన ఇన్నోవేషన్‌ ఈకో సిస్టం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు వారు తెలిపారు. చికాగో ఫుడ్‌ స్టాప్‌ లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక వ్యాపారవేత్తలతో మంత్రి కేటీఆర్‌ సంభాషించారు. ముఖ్యంగా చికాగో అనుసరిస్తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతులపై ప్రత్యేకంగా చర్చించారు. చికాగో ఫుడ్‌ స్టాప్‌ మాదిరి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పురోగతికి, తెలంగాణ ఆహార ఉత్పత్తులలో ఇన్నోవేషన్‌, ఆహార అలవాట్ల చరిత్రను భద్రపరచడం వంటి అంశాల కోసం తెలంగాణ ఫుడ్‌ స్టాప్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఇన్నోవేషన్‌ ప్రాధాన్యత ఎంతగానో ఉన్నదని, ఇది కేవలం ఫుడ్‌ ఇండిస్టీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి సైతం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే రైతుల ఆర్థిక పురోగతి మరింత వేగంగా సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన అద్భుతమైన పురోగతిని వివరించారు.