అధ్వాన్న స్థాయికి ఆర్థిక మందగమనం

To a worse degree Economic slowdownఅధికారికంగా ప్రకటించే జీడీపీ పెరుగుదల లెక్క అనుమానాస్పదంగా వుంటోంది. ఎందుకంటే వినియోగ దారుల ధరల సూచి ఆధారంగా తీసే లెక్కల్లో నాలుగో వంతు కూడా లేని అంతర్గత ద్రవ్యోల్బణ భావన ప్రాతిపదికగా అది రూపొందుతున్నది. ఈ విధంగా వండిన లెక్కలతో కూడినదే అయినా అది కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిందనే వాస్తవం మాత్రం దాచలేనిదిగా తయారైంది. 2024-25కు సంబంధించి తాజాగా విడుదలైన జీడీపీ అంచనాలు కూడా అదే చెబుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ పెరుగుదల 6.4 శాతం వుంటుందని ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఇది 8.2 శాతం పెరుగుదలతో దీన్ని పోల్చవలసి వుంటుంది. ఇంతకన్నా ముందు మూడవ త్రైమాసికంలో ఈ పెరుగుదల రేటు 5.4 శాతం వుండింది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దేశంగా ఇండియా ఆవిర్భవించిందనే మాటలు చాలా వినిపిస్తుంటాయి. 2027 నాటికి దేశం 5 లక్షల కోట్ల ఆలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనీ చెబుతుంటారు. ఇవన్నీ ఏమైనా వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా వున్నాయి. నిరుద్యోగం, ఆహార ద్రవ్యోల్బణం, తక్కువ స్థాయి ప్రయివేటు పెట్టుబడులు, స్తంభించిపోయిన వినియోగదారీ వ్యయం, చిన్న చిల్లర రుణాల చెల్లింపులో వైఫల్యాల పెరుగుదల, ఉత్పత్పి రంగం పడిపోతుందడటం ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆర్థిక విధానాల దివాళాకోరుతనానికే సంకేతాలుగా వున్నాయి.
మూల కారణమేంటి?
ఆర్థిక మందగమనం కొనసాగుతుండటానికి ప్రధాన కారణం వ్యవస్థలో గిరాకీ లేకపోవడమే. అల్పిష్టి ఆదాయాలుగల ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా పోయిన ఫలితమిది. 2023-24 సంవత్సరానికి గాను ఇటీవలే విడుదల చేసిన గృహాల వినియోగ వ్యయం వివరాలు చూస్తే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం నెలవారీ సగటు ఖర్చు పల్లెల్లోనైతే రూ.8,079, పట్టణాలలోనైతే రూ.14,528 మాత్రమేనని తేలింది. పెరిగిపోయే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దీన్ని మరింత జటిలంగా మారుస్తున్నాయి. వాటి వల్ల ఆదాయాలు హరించుకుపోతున్నాయి. గిరాకీ కొరవడిన పరిస్థితి ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టి ఉత్పాదక సామర్థ్యాలు పెంచాలనే ఆసక్తి లేకుండా పోతుంది. మరోవైపున ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ అక్టోబర్‌ నెలల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌.డి.ఐలు) ప్రవాహాలు చూస్తే పన్నెండేండ్ల కాలంలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోయాయి. ఇక బయిటకు తరలిపోయే వాటిని గనక చూస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు వాటిని దేశం నుంచి తీసుకుపోవడం పెరిగింది. భారతీయ కంపెనీలు వీదేశాలలో పెట్టుబడులు పెట్టడం కూడా పెరగడం దీన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఎన్ని గొప్పలు చెప్పినా భారతీయ కార్పొరేట్లకు స్వదేశం కన్నా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడమే ఎక్కువ ఆకర్షణగా కనిప ిస్తున్నది. విలువ కోల్పోతూ డాలర్‌కు 86కు చేరిన భారతీయ రూపాయి ఇప్పటికే వున్న సమస్యలను మరింత దుర్భరం చేయబోతున్నది. దాని వల్ల దిగుమతులు ఖరీదవడం, ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయడం జరుగుతుంది.
బడా సంపన్నులకే సేవ
బడా వ్యాపార వ్యవస్థలకు అనుకూలమైన ప్రభుత్వ పాక్షిక విధానాలు అసమానతలను ఎగదోస్తున్నాయి. దానివల్ల ప్రయివేటు పెట్టుబడులు అభివృద్ధి దెబ్బ తింటున్నాయి. బిలియనీర్‌ ప్రమోటర్ల క్లబ్బులో గత ఏడాది చివరన 157 మంది వుంటే 2024లో ఆ సంఖ్య రికార్డు స్థాయిలో 201కి పెరిగింది. వారి మొత్తం సంపద కలిసి మొదటిసారిగా లక్ష కోట్ల డాలర్లు దాటింది. ఆదాయాల తగ్గుదల, పెరిగిపోతున్న వ్యయాలు, హద్దూ ఆపూ లేని నిరుద్యోగంతో ప్రజలపై భారాలు పెంచుతూ అంతకంతకూ తీవ్రమవుతున్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలనే విషయమై ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో వుంది.
షరా మామూలే?
మోడీ ప్రభుత్వ తీరును గమనిస్తే వచ్చే 2025-26 బడ్జెట్‌ కూడా ఇప్పటి వరకూ అది ఏఏటికా ఏడాది కుమ్మరిస్తున్న తరహా విధానాలే మరింత పెంచే విధంగా ముగుస్తుంది. కార్పొరేట్ల మీద బడా సంపన్నుల మీద పన్నులు పెంచి మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగాల్లో పభుత్వ పెట్టుబడులు పెంచి, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ఇప్పుడు జరగాల్సి వుంటుంది. ప్రస్తుతం జీడీపీలో ఏడు శాతం మాత్రమే వున్న సంక్షేమ రంగ వ్యయాన్ని పెంచడం అవసరం, ఈ చర్యలు తీసుకోకపోతే ఆర్థిక పునరుద్ధరణ గానీ, ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశాలు శూన్యమే అవుతాయి.
(జనవరి 15 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)