– కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహపర్చలేవు : ఖర్గే
బాలాఘాట్ (మధ్యప్రదేశ్) : ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహపర్చలేవని ఆ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని కటంగి పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లోనూ కాంగ్రెస్‌దే విజయమని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో ఇడి, సిబిఐ, ఐటి దాడుల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి వారిని ఇళ్లలో కూర్చోబెట్టాలని మోడీ, అమిత్‌షా భావిస్తున్నారు. ఈ దాడులతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతారని వారు ఆలోచిస్తున్నారు. కానీ అది జరగదు’ అని ఖర్గే చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ఒకప్పుడు తీవ్రంగా విమర్శించారని, అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపాధి కల్పించడానికి అదే కార్యక్రమం ప్రభుత్వానికి సహాయ పడిందని ఖర్గే తెలిపారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల దృక్పథాల కారణంగానే ప్రస్తుత ప్రభుత్వం లక్షలాది మందికి ఉచిత రేషన్ అందించగలుగుతోందని చెప్పారు.